ఆత్మకూరు ఫలితంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్-అయినా ఓట్లు పెరగలేదట...
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం తారాస్ధాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ స్ట్రాటజిక్ కమిటీ సమావేశంలో కీలక విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో వెలువడిన ఫలితంపై చంద్రబాబు చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఇవాళ జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్ధితులపై నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు వివిధ అంశాలపై వారితో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో పన్ను వాతలు, పథకాలకు కోతలు తప్పడం లేదన్నారు. ప్రజలకు అందే పథకాలలో రకరకాల నిబంధనల పేరుతో కోతులు పెట్టి డబ్బులు మిగుల్చుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అమ్మఒడి పథకంలో 52 వేలమంది లబ్ధిదారులు తగ్గారని ఆరోపించారు. ఒంటరి మహిళకు ఇచ్చే పెన్షన్ లో నిబంధనలు మార్చారన్నారు.
ఒంటరి మహిళ పెన్షన్ లో ఆంక్షలు అమానవీయమని చంద్రబాబు ఆక్షేపించారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్ కు రాజధాని భూమలు అమ్మే హక్కు ఎక్కడుందని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిని స్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఎకరా 10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని ఆయన నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా...ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వజూపడం అన్యాయమన్నారు.
డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నాఆత్మకూరులో వైసీపీకి ఓట్లు పెరగలేదని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆత్మకూరు ఉపపోరు ఫలితాల్లో కనిపించిందన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టుకు చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనమన్నారు. ఈ-క్రాప్ నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారని విమర్శించారు.