మహానాడుకు అడ్డంకులా ? ఏ మొహం పెట్టుకుని బస్సు యాత్రలు ? వైసీపీపై చంద్రబాబు ఫైర్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరు మరింత ముదురుతోంది. ఓవైపు టీడీపీ మహానాడు, మరోవైపు వైసీపీ మంత్రుల బస్సుయాత్రతో మాటలయుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో టీడీపీ మహానాడుకు బయలుదేరిన చంద్రబాబు మధ్యలో చిలకలూరిపేటలో ఆగి వైసీపీ సర్కార్ పై విమర్శలకు దిగారు.
కోనసీమన వైసీపీ మనుషులే తగులపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదేనన్నారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారని, మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు విమర్శించారు. వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని వైసీపీ తీరును తప్పుబట్టారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగన్ కు అలవాటుగా మారిందన్నారు.
ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రభుత్వాన్ని జగన్ నడపలేరని చంద్రబాబు పేర్కొన్నారు. మధ్యంతరానికి జగన్ సిద్దపడుతున్నారని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, టీడీపీ కార్యకర్తలెవరూ భయపడరని గుర్తుచేశారు. జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తానన్నారు. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా అని ప్రశ్నించారు. మహానాడుకు బస్సులివ్వకుండా, ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా అని నిలదీశారు.జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రని, మహానాడుకు నడిచైనా.. ఎడ్లబళ్లల్లోనైనా రావాలని నేతల్ని, కార్యకర్తల్ని ఆయన కోరారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదమన్నారు.

రాష్ట్రంలో ఆ వర్గమైనా బాగున్నారా..? ఏ ఒక్క వర్గం బాగుందన్నా.. తిరిగి అమరావతికి వెళ్లిపోతానని చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీలో ఎక్కడుంది సామాజిక న్యాయమని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమపై ప్రేమ లేదని, అందుకే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించ లేదన్నారు. విశాఖ మీద ప్రేముందని, రాజధాని తీసుకెళ్తానన్నవాడు.. రాజ్య సభ స్థానాలు ఎందుకు కేటాయించ లేదని చంద్రబాబు ప్రశ్నించారు. .తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ముద్దాయిలే ఉన్నారని గుర్తుచేశారు.
ఏ ముఖం పెట్టుకుని బస్ యాత్ర చేపడతారని వైసీపీ మంత్రుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. ఎస్సీలకు చెందిన 28 స్కీములు రద్దు చేశారని, డబ్బులున్న వాడికి ఊడిగం, పేదవాళ్లను దోచుకోవడమే జగన్ థియరీ అని చంద్రబాబు అన్నారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని, దావోస్ కు వెళ్లి అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు చేసుకున్నారని, టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు కొనసాగించారు కానీ.. అన్న క్యాంటీన్లు కొనసాగించరా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవరును చంపేస్తే.. కప్పి పుచ్చే ప్రయత్నం చేశారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ పోరాడితే కేసు నమోదు చేశారని, అనంతబాబు వ్యవహరంలో వైసీపీని ప్రజలు ఛీ కొట్టారని పేర్కొన్నారు.