ఇద్దరు టీడీపీ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు: ఎందుకంటే..?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ప్రక్షాళన ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో నెల్లూరు నేతల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలను రద్దు చేశారు.
అంతేగాక, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని టీడీపీ అధినేత సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ పనితీరు మార్చుకోకుంటే భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక మరికొందరిపై చర్యలు ఉంటాయని చంద్రబాబు తేల్చిచెప్పారు.

మరోవైపు త్వరలో నెల్లూరు నగర టీడీపీకి కొత్త కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయాలంటే యువరక్తం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై టీడీపీలో ఇకపై కుమ్మక్కు రాజకీయాలు సాగవని చంద్రబాబు స్పష్టం చేశారు. కోవర్టులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు పార్టీకి అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారికి టీడీపీలో స్థానంలేదని కుప్పంలో ఇటీవల చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
జగన్ సర్కారుపై విరుచుకుపడ్డ చంద్రబాబు
అమరావతి: ఏపీ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని, రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్‌లో ఏం సాధించారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. మాయమాటలు.. సన్నాయి నొక్కులు, డైవర్షన్లు వద్దని చంద్రబాబు చురకలంటించారు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల అంతా నష్టమే జరుగుతోందని ఆయన అన్నారు.
అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై ఇంకెన్నాళ్ల్లు ప్రజల్ని మభ్యపెడతారని చద్రబాబు మండిపడ్డారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తీసుకొస్తామని.. అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. నాడు ప్రజలు, యువతకు హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు సాధించలేకపోయారని చంద్రబాబు నిలదీశారు. ఇది మోసం, దగా కాదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడదామన్నారు. ఈ సవాలుకు సిద్ధమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు చంద్రబాబు. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అంతేగాక, విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ.. రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జగన్ ఇప్పుడు మౌనమెందుకు వహిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుపై లాలూచీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. త్వరలోనే వైసీపీ సర్కారుపై ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు.