పాత కక్షలతోనే చంద్రయ్య హత్య: ప్రధాన నిందితుడు వెల్దుర్తి ఎంపీపీతో పాటు మరో ఏడుగురు అరెస్ట్
తెలుగుదేశం పార్టీ నేత చంద్రయ్య హత్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ రగడ అంతా ఇంతా కాదు. చంద్రయ్య హత్య రాజకీయ హత్య అని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించగా, చంద్రయ్య హత్యతో వైసీపీకి ఏ విధమైన సంబంధం లేదని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ విమర్శలకు సమాధానమిచ్చారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టిడిపి నేత చంద్రయ్య హత్య కేసును గుంటూరు జిల్లా రూరల్ పోలీసులు ఛేధించారు.

చంద్రయ్య హత్యకేసు: ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన గుంటూరు రూరల్ పోలీసులు
ఇదిలా ఉంటే పాత కక్షలతోనే చంద్రయ్య హత్య జరిగిందని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ వెల్లడించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టిడిపి నేత తోట చంద్రయ్య హత్య కేసును చేదించిన గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించిన వివరాల ప్రకారం పాత కక్షలతో ఈ హత్య జరిగినట్లుగా పేర్కొన్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించామని పేర్కొన్నారు. చంద్రయ్య కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

పాత కక్షలతోనే చంద్రయ్య హత్య
చంద్రయ్య బైక్ పై వెళ్తున్న సమయంలో ఆపి నిందితులు కత్తులతో దాడి చేసినట్లుగా ఉదయం 7గంటల నుంచి ఏడున్నర గంటల మధ్యలో హత్య జరిగినట్లుగా ఎస్పీ తెలిపారు.మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివరామయ్య గుండ్లపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, మూడేళ్ల క్రితం చంద్రయ్యకు, శివరామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్ విషయంలో గొడవలు జరిగాయని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు. అప్పటి నుంచి వారి మధ్య మొదలైన కక్షలు మళ్లీ ఇటీవల కాలంలో బయటపడ్డాయని పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడు శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీ
ఇటీవల చంద్రయ్య శివరామయ్యను హతమారుస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరిగిందని, ఈ క్రమంలోనే శివరామయ్య చంద్రయ్య కంటే ముందే తాను చంద్రయ్యను హతమార్చాలని నిర్ణయించుకుని, తన కుమారుడుతో పాటు ఆరుగురు అనుచరుల సహాయంతో చంద్రయ్యను హతమార్చాడని ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. చంద్రయ్యను హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడైన చింతా శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉన్నాడు. శివరామయ్యతో పాటుగా చింత ఎలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివన్నారాయణ, చింత ఆదినారాయణలను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు: ఎస్పీ విశాల్ గున్నీ
ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని విశాల్ గున్నీ పేర్కొన్నారు. ఈ కేసు నేపథ్యంలో మాట్లాడిన గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షలు పడే విధంగా చూస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు.