దేవుడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు దరిద్రులు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్
ఏపీలో తాజాగా దేవాలయాలకు రక్షణ లేదంటూ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అధికార పార్టీ పై నిప్పులు చెరుగుతున్నాయి. అంతర్వేది ఘటన, ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథంపై మూడు సింహాలు మాయమైన ఘటన, ఇలా అనేక ఘటనల నేపథ్యంలో ఆలయాలకు, దేవుళ్ళకు రక్షణ లేదని మండిపడుతున్నారు.
అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకుల పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

దేవుళ్ళను అడ్డు పెట్టుకుని రాజకీయాలా ?
తాజాగా దేవుడి పేరు చెప్పి, దేవుళ్ళను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దేవుడ్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే వారంతా దరిద్రులు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆలయాల విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం అంటూ పేర్కొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ పాదయాత్ర శ్రీవారి దర్శనం తర్వాత మొదలైందని గుర్తు చేశారు. అలాగే పాదయాత్ర ముగింపు తర్వాత కూడా జగన్ తిరుమలకు వచ్చారని ఆయన వెల్లడించారు.

దేవాలయాల విషయంలో పారదర్శకంగా వైసీపీ సర్కార్
మిరాశీ వ్యవస్థను చట్టం చేసి న్యాయం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు . ఆలయాల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
దేవుడే లేదన్న డీఎంకే పార్టీకి అత్యంత భక్తి కలిగిన తమిళులు పట్టం కట్టారని గుర్తుచేశారు. టీటీడీ ఆలయ ఆస్తుల, ఆదాయ వ్యయాల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే కాగ్ తో ఆడిట్ చేయించనుంది అన్నారు. ఇక అంతర్వేది ఘటనపై కూడా సీబీఐ విచారణకు ఆదేశించారని అన్నారు .

వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న భక్తిలో పది శాతం కూడా చంద్రబాబుకు లేదు
జంధ్యం వేసుకోని బ్రాహ్మణుడు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అంటూ పేర్కొన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
చంద్రబాబుకు తాను సవాల్ చేస్తున్నానన్న భాస్కర్ రెడ్డి వై వి సుబ్బారావు కుటుంబానికి ఉన్న భక్తిలో పదిశాతం కూడా చంద్రబాబు కుటుంబానికి ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాదు టిటిడి ఆస్తుల విషయంలో, స్వామివారి ఆభరణాల విషయంలో, పింక్ డైమండ్ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వైసిపి ప్రభుత్వం ఎవరిని వదలదు అని హెచ్చరించారు.

ప్రతిపక్షాలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదురు దాడి
తప్పు చేసిన వారిపై తప్పక చర్యలుంటాయని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కావాలని ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, దేవుళ్ళను కూడా అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమైన చర్య అని భాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న
ప్రతిపక్ష పార్టీలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిప్పులు చెరిగారు.