ఏపీలో దాడులు జరిగిన ఆలయాల పర్యటనలో చిన్నజీయర్ స్వామి .. ఆలయాల రక్షణ అందరి బాధ్యత అని ధర్మ ప్రబోధం
రామతీర్థం ఘటన తరువాత ఏపీలో ఆలయాలలో విగ్రహ విధ్వంసం ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ స్వామిజీలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా నెల్లిమర్ల లోని రామతీర్థంలో పర్యటించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుండి రాజకీయాలకు అతీతంగా ఆలయాల ధర్మ పర్యటనను కొనసాగిస్తానని ప్రకటించారు.
అందులో భాగంగా ధర్మ పర్యటన మొదలు పెట్టిన చిన్న జీయర్ స్వామి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు.
ఇది ఒక హెచ్చరిక అందుకే ఈ నెల 17 నుండి .. రామతీర్థంలో చినజీయర్ స్వామి ఆసక్తికర ప్రకటన

వగరూరు ఆలయాన్ని సందర్శించిన చిన్నజీయర్ స్వామి .. శేష పడగల విగ్రహ ధ్వంసంపై ఆరా
ఇటీవల స్వామివారి శేష పడగల విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన నేపథ్యంలో, ఆలయాన్ని సందర్శించిన చిన్న జీయర్ స్వామి, ఆలయ అర్చకులను, గ్రామ పెద్దలను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి విగ్రహం ధ్వంసం కావడం ఇది రెండోసారి అని గ్రామస్తులు చిన్న జీయర్ స్వామీజీ కి తెలియజేశారు. అహోబిలం పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామీజీ తో కలిసి వగరూరు గ్రామంలో ధ్వంసమైన స్వామివారి విగ్రహాన్ని పరిశీలించిన చిన్న జీయర్ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.

ఆలయాల రక్షణ అందరి బాధ్యత అన్న చిన్న జీయర్ స్వామీజీ
ఆలయాల రక్షణ అందరి బాధ్యత అంటూ, వెలుగునిచ్చే దేవుడిని కాపాడుకోవాలని చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. అన్ని మతాల సారం ఒక్కటేనని, దేవుడిని వివిధ రూపాల్లో ఆరాధించినా ఆయన ఒక్కరేనని చినజీయర్ పేర్కొన్నారు. మతాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అందరూ గౌరవిస్తే ఏ ఇబ్బంది ఉండదని స్వామీజీ తెలిపారు. ఆలయాల పరిరక్షణ పై ధర్మకర్త లకు, గ్రామ పెద్దలకు సూచనలు చేసిన చిన్న జీయర్ స్వామి ఏడాదిలోగా ఆలయాన్ని పునర్నిర్మించాలని వారిని కోరారు.

స్వామీజీ సూచన మేరకు ఆలయ పునర్నిర్మాణం కోసం 30 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చిన గ్రామస్తులు
చిన్న జీయర్ స్వామి సూచనమేరకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణం కోసం 30 లక్షల రూపాయల విరాళాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగిన వివిధ ఆలయాలను సందర్శించి చిన్న జీయర్ స్వామి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి కూడా తగు సూచనలు చేస్తామని వెల్లడించారు . ఆలయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలని చిన్న జీయర్ స్వామి ప్రజలను సైతం చైతన్యం చేస్తున్నారు .