• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విభజన పాపం బాబు, జగన్‌లదే: చిరు, కిరణ్‌పైనా ఫైర్

|

విశాఖపట్నం: రాష్ట్ర విభజన బాధాకరమేనని, విభజన పాపం ఒక్క కాంగ్రెస్ పార్టీపై నెట్టడం సమంజసం కాదని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఆయన విశాఖపట్నంలో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. విభజన పాపంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలకు భాగస్వామ్యం ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని చిరంజీవి గుర్తు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారని, తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని కూడా జగన్ చెప్పారని చిరంజీవి అన్నారు. విభజనకు అనుకూలమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని పార్టీలు మాట మార్చాయని ఆరోపించారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళతామని చిరంజీవి చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయలేదని అంటున్నారు.. మీరేందుకు రాజీనామా చేయలేదని మీడియా ప్రశ్నించగా.. తాను రాజీనామా చేశానని, అయితే రాజీనామా ఆమోదం పొందలేదని చిరంజీవి చెప్పారు.

Chiranjeevi fires at Chandrababu and YS Jagan and Kiran

సిడబ్ల్యూసి విభజనపై నిర్ణయం ప్రకటించే ముందే కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు తెలిపిందని, అయితే తాను కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ చెప్పారని చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత నిర్ణయం వచ్చాక ఏం చేద్దామని తమను అడిగారని, పదవి కోసమే విభజన నిర్ణయాన్ని ఇప్పటి వరకు కిరణ్ వాయిదా వేయించారని ఆరోపించారు. 2011లో కూడా కాంగ్రెస్ అధిష్టానం విభజనపై ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటామని కిరణ్ చెప్పారని గుర్తు చేశారు. ఉద్యోగులతో తమపై ఆరోపణలు చేయించి.. తమను అవమానాలకు గురి చేశారని కిరణ్‌పై మండిపడ్డారు.

ఏక్ నిరంజన్‌లా ఒక్కడే నిర్ణయం తీసుకుని మిగితా వారిని మబ్యపెడుతున్నారని విమర్శించారు. ఇంకా విభజన జరగలేదని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అధికారపక్షంలో ఉండి కూడా తాను విభజనను వ్యతిరేకిస్తూ పార్లమెంటు వెల్లోకి వెళ్లినట్లు తెలిపారు. రాజ్యసభలోనూ తానే మాట్లాడానని గుర్తు చేశారు. ఆఖరి బంతి అంటూ కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేస్తే తామే గళమెత్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారినుద్దేశించి మాట్లాడుతూ... పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని అన్నారు.

13 జిల్లాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని, ఆయన తనతో మాట్లాడారని చెప్పారు. కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్తేజం కలిగించేందుకు బస్సు యాత్ర చేపట్టినట్లు చిరంజీవి చెప్పారు. కార్యకర్తలు, అభిమానులే మాకు కొండంత అండని తెలిపారు. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు మాతోనే ఉన్నారని చెప్పారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బస్సుయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.

పదవులు అనుభవించి గోడలు దూకారం: రఘువీరా

కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా పదవులు అనుభవించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో శనివారం

నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన బాధాకరమే అయినప్పటికీ జరిగిపోయిందని, పార్టీని వీడటం సరికాదని అన్నారు. ప్రస్తుతం నామినేషన్ వేయలేని పరిస్థితి నెలకొందని, నామినేషన్ వేసిన వారు ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించాలని కోరారు.

సీమాంద్ర ప్రాంతానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీతోపాటు ఐదేళ్ల ప్రత్యేక హోదాను ప్రకటించిందని, దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రఘువీరారెడ్డి తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. పన్ను మినహాయింపుతో పరిశ్రమల అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. 20 నుంచి 25ఏళ్లలో సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మిస్తామని కేంద్రం ప్రకటించిందని తెలిపారు.

ముంపు గ్రామాల సమస్య పరిష్కారం అయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకుంటాయని చెప్పారు. 2009లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే సర్వేలు వచ్చాయని, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే దేశంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని చెప్పారు. అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నామని చెప్పడంతోనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రఘువీరా రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.

English summary
Union Minister Chiranjeevi on Saturday fired at TDP president Chandrababu Naidu and YSR Congress Party president YS Jaganmohan Reddy and former CM Kiran Kumar Reddy on state bifurcation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X