చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు రక్తచరిత్ర: కొండమిట్టతో ప్రారంభిస్తే సికె బాబు, కటారి, చింటూ....

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చిత్తూరు నగరం రక్త చరిత్ర పెద్దదే. నాలుగున్నర దశాబ్దాల వెనకకు వెళ్తే ఆ రక్తచరిత్ర ఏమిటో తెలుస్తుంది. నగరంలోని కొండమిట్ట అంటే నాలుగున్నర దశాబ్దాల క్రితం ప్రజలకు వెన్నులో చలి పుట్టేది. రౌడీలు కొంత మంది చిత్తూరు నగరాన్ని తమ చేతలతో వణికించారు. దాడులు, దౌర్జన్యాలు యథేచ్చగా చేసేవారు.

కొండమిట్ట ప్రాంతంలోని రెండు సినిమా థియేటర్లకు రాత్రిళ్ళు మహిళలు వెళ్ళేవారు కాదు. కొందరు చిల్లర రౌడీలు, పోకిరీలు మహిళలను వేధించడం, అత్యాచారాలకు తెగబడడం వంటి చర్యలతో అది అట్టుడికిపోయేది.. ఈ సంస్కృతి ఆ ప్రాంతంలో 1990వ దశకం వరకూ కొనసాగింది. ఈ ప్రాంతానికి చెందిన రామచంద్ర, అతని సోదరుడు తనికాచలం, కుమారుడు శివ, కొండమిట్ట గుణ, కొండమిట్ట రాజా వంటివారు రౌడీలుగా చిత్తూరులో పేరుమోశారు.

ఒక్క కొండమిట్టే కాదు తోటపాళ్యంలో అగ్గిపెట్టె ఇవ్వలేదని, నడిబొడ్డునున్న పాత బస్టాండులో జామకాయ ఇవ్వలేదని ఇద్దరు అమాయకుల్ని రౌడీమూకలు హతమార్చిన ఉదంతాలు చిత్తూరులో నెలకొన్న రౌడీ సంస్కృతిని అద్దం పడుతాయి.

ఇటువంటి స్థితిలో సికె బాబు రంగప్రవేశం జరిగింది. నగరంలో పేరుమోసిన రౌడీ కొండమిట్ట రామచంద్ర హత్యతో సీకేబాబు పేరు తొలిసారిగా అందరికీ తెలిసింది. కళాశాలలో చదువుకునే సమయంలోనే విద్యార్థి నేతగా వున్న సీకేబాబు దుడుకుగా వ్యవహరించేవారంటారు. దాడులు, దొమ్మీలు, దౌర్జన్యాలు వంటి పలు సంఘటనల్లో పాల్గొన్నట్టు ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

వ్యక్తుల మధ్య లేదా గ్రూపుల మధ్య మాత్రమే తగాదాలు ఉండేవి. రాజకీయ పార్టీల ప్రమేయం ఈ రౌడీపోరాటాల మీద ఉండేది కాదు. చిత్తూరు మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ పదవికి సీకేబాబు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడంతో పరిస్థితి మారింది. ఆ ఎన్నికల్లో గెలిచిన సీకేబాబు ఏకంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యారు. దీంతో సీకేబాబు వ్యక్తిగా గాక చిత్తూరులో బలమైన ఒక వర్గంగా మారిపోయారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు టిడిపి టికెట్‌ దక్కే అవకాశం ఆయనకు తృటిలో చేజారింది.

 Chittoor is having history of mafia

స్థానిక మీడియా కథనాల ప్రకారం - 1989లో స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రాజకీయ పార్టీల చూపు ఆయన మీద పడింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు అండగా నిలబడింది. దీంతో నగరంలో బలమైన నేతగా సికె బాబు ముందుకు వచ్చారు. ఈ కాలంలోనే చిత్తూరులో దాడులు, బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాలు జరిగాయి. అంతదాకా రౌడీలుగా వీరవిహారం చేసినవారిలో కొందరు హత్యకు గురయ్యారు. మిగిలినవారు రౌడీయిజాన్ని వదిలేశారు.

కాంగ్రెసులో ఉన్నప్పటికీ సీకేబాబు ఎప్పుడూ పార్టీకీ, పార్టీ అధినేతలకూ లోబడి ఉండేవారు కాదు. చిత్తూరు వరకూ ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. దీంతో కాంగ్రెస్‌ నాయకులంతా చిత్తూరులో డమ్మీలుగా మారిపోయారు.

ఈ సమయంలోనే సీకేబాబుకు అనుచరుడిగా ఉండిన కటారి మోహన్‌ ఎదురు తిరగడంతో చిత్తూరులో కొత్త అధ్యాయం మొదలైంది. దాడులు, ప్రతి దాడులు, హత్యాయత్నాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ అండతో కటారి మోహన్‌ రాజకీయంగా కూడా బలపడ్డారు. పరిస్థితులు తారుమారయ్యాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలకు సీకే బాబు దూరంగా ఉండిపోయారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆయన భార్య పోటీ చేసినా ఓడిపోయారు.

సికె బాబు సందడి చిత్తూరులో సద్దుమణిగింది. కటారి వర్గం హడావుడి పెరిగింది. కటారికి స్వయంగా మేనల్లుడైన చింటూనే ఎదురు తిరిగాడు. మళ్ళీ చిత్తూరులో గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మేయర్‌ కటారి అనూరాధ, కటారి మోహన్‌ హత్య జరిగింది.

English summary
Chittoor city is having history of mafia, rowdism. It perculated into political parties like Congress and Telugu Desam (TDP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X