• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుమలలో అన్యమత ప్రార్థన, దళ్ ధర్నా, భక్తుల ఫైర్

By Srinivas
|

చిత్తూరు/హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలలో అన్యమత ప్రచారం పైన భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయడమే కాకుండా, వేంకటేశ్వరుణ్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ తిరుమలలోనే చిత్రీకరించిన వీడియో క్లిపింగ్ ఒకటి యూట్యూబ్‌లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాదులోని లిబర్టీ చౌరస్తాలో గురువారం ఉదయం బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడంలో టీటీడీ విఫలమైందని ధ్వజమెత్తారు.

కాగా, తన పేరు పాస్టర్ సుధీర్ మొండితోకగా చెప్పుకున్న ఓ వ్యక్తి దీనికి మూలకారకుడుగా యూట్యూబ్‌లో మత ప్రచార వీడియో పెట్టిన విషయం తెలిసిందే. వెంకన్న పేరుతో రాతిబొమ్మను కొలుస్తున్న హిందువులు పాపాత్ములంటూ చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టిన సుధీర్ విదేశీ క్రైస్తవ సంస్థల నుంచి నిధుల కోసం అభ్యర్ధించడం గమనార్హం.

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీడియో చిత్రీకరణ జరిగినట్లు పేర్కొన్నాడు. 17 నిమిషాల నిడివి గల ఈ దృశ్యాలు సంచలనం రేకెత్తించడంతో టీటీడీ రంగంలోకి దిగింది. యూట్యూబ్‌లో ఉంచిన దృశ్యాల ఆధారంగా ఆలయం ముందున్న సీసీ కెమేరా ఫుటేజ్‌లను టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సుధీర్‌తో పాటు ఆరుగురు బృందం ఓ వాహనంలో వచ్చి వీడియో చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ బృందంలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.

Christian Campaign in Tirumala: Bajarang Dal stages dharna

ఈ సంఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు తీవ్రంగా స్పందించారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

వీడియోలో ఉన్న వివరాల ప్రకారం... ఒక ప్రత్యేక వాహనంలో బయలుదేరిన సుధీర్ అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాన్ని ఆపి అక్కడ తనిఖీ కోసం అగివున్న కార్లను, తిరుమల కొండ దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం ఘాట్ రోడ్డులో చిత్రీకరిస్తూ మార్గమధ్యంలో ఆగి ప్రసంగాలు చేస్తూ తనతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలసి ప్రార్థనలు చేశారు.

శ్రీవారి ఆలయం వద్ద గల బేడి ఆంజనేయస్వామి ముందు భక్తులు కొబ్బరికాయలు సమర్పించే దృశ్యాలు ఉన్నాయి. ఆలయం ముందు నుంచి వెడుతున్న ఓ భక్తుడిని పిలిచి అతడిని చిత్రీకరించారు. అలాగే ఆలయ మహాద్వార గోపురం దృశ్యాలు కూడా వీడియో క్లిపింగ్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా సుధీర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతూ కలియుగ దైవం అని చెప్పుకుంటు వెంకన్న పేరుతో రాతి విగ్రహాన్ని కొలుస్తున్నారని, ఈ భక్తులంతా పాపాత్ములని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఉపశమనం కోసం తిరుమలకు వస్తున్న వారి కోరికలు నెరవేరడం లేదని, భక్తులంతా పాపాలు చేస్తున్నారని వారిని క్షమించి వారికి మేలు జరిగేలా ప్రార్థనలు చేస్తానని చెప్పుకున్నాడు. ప్రసంగం అయ్యాక నిధులు పంపించాలని కోరాడు. అతను అలిపిరి, దేవాలయం ఎదుట ప్రార్థనలు చేశాడు. యూట్యూబ్‌లో ఉన్న దృశ్యాలను పరిశీలిస్తే ఈ బృందం రెండు రోజులపాటు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో బస చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ సంఘటనపై అర్బన్ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ అంశంపై శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామి తీవ్రంగా స్పందించారు. సర్కారు వివక్షే దీనికి కారణమన్నారు. దేవాదాయ శాఖ, టీటీడీ అధికారులు మొద్దునిద్ర పోతున్నారన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం పునరావృతం అవుతున్నప్పటికీ, టీటీడీకి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నప్పటికీ స్పందించక పోవడాన్ని ఆయన ఖండించారు.

English summary
Christian Campaign in Tirumala, Bajarang Dal stages dharna at Liberty cross road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X