చంద్రబాబు..నారాయణ పై మరో కేసు : ఎఫ్ఐఆర్ లో 14 పేర్లు - ఎమ్మెల్యే ఫిర్యాదుతో..!!
మాజీ ముఖ్యమంత్రి...టీడీపీ అధినేత ఏ-1గా మరో సీఐడీ కేసు నమోదైంది. పదో తరగతి పేపర్ల లీక్ లో అరెస్ట్ నారాయణ సైతం ఈ కేసులో ఏ-2గా చేర్చారు. అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీ భూదోపిడీకి పాల్పడ్డారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఇన్నర్‌రింగ్ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్‌ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి.. రోడ్డు డిజైన్ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లుగా డ్రామా ఆడి.. తాము ముందుగా అనుకున్న డిజైన్‌నే ఖరారుచేశారనేది అభియోగం.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో
ఈ మధ్యలో ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఇరువైపులా తమ కుటుంబ వ్యాపార సంస్థలు, సన్నిహితులు, బినామీల భూములు ఉండేలా కథ నడిపించారు. ఆ విధంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన బినామీ లింగమనేని గ్రూప్ సంస్థలు, నారాయణ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అడ్డగోలుగా వేలకోట్ల ప్రయోజనం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి తమ బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారనేది ఫిర్యాదు.

కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ
ఫిర్యాదు ఆధారంగా సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్, హెరిటేజ్ కంపెనీ, లింగమనేని గ్రూప్ సంస్థలతోపాటు మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-3గా లింగమనేని రమేష్‌లతోపాటు 14మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు అయింది. టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండనున్నది నిర్ధారణ అయిపోయింది.

14 మంది పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదు
కానీ, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని నివేదికలో తేల్చారు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైందని చెబుతున్నారు. ఆర్కే ఫిర్యాదులో వీరి కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని..వీరి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో..ఇప్పుడు సీఐడీ వీరి విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.