తిరుపతి విమానాశ్రయంలో నీళ్లు ఆపేసిన వైసీపీ ఎమ్మెల్యేకుమారుడు-స్పందించిన కేంద్రమంత్రి
తిరుపతి విమానాశ్రయంలోకి ఎంట్రీ ఇవ్వనందుకు ఎయిర్ పోర్టుకు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి నీళ్లు ఆపేయించిన ఘటన కలకలం రేపుతోంది. ఎయిర్ పోర్టుతో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కు సైతం తాగునీరు నిలిపివేయించిన ఘటనపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే కేంద్ర పౌరవిమానయానమంత్రికి దీనిపై పలు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆయన స్పందించారు.
తిరుపతి విమానాశ్రయానికి తాగునీరు నిలిపేయించిన ఘటనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నహసింహారావు కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయానమంత్రి జోక్యం చేసుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన పౌరవిమానమంత్రి సింధియా ట్వీట్ చేశారు. తనవైపు నుంచి ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తామని, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఎయిర్ పోర్టులో సిబ్బందితో పాటు ప్రయాణికులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకుంటామని ఆయన బీజేపీ ఎంపీ జీవీఎల్ ట్వీట్ కు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

తిరుపతి ఎయిర్ పోర్టు ఘటనపై బీజేపీ నేతలు కేంద్రంలోని ఇతర పెద్దలకు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేత చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వకపోతే తాగునీరు నిలిపేసి టార్గెట్ చేస్తారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా సదరు వైసీపీ నేత అభినయ్ రెడ్డి కానీ, ఆయన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.