అతడికి పదవి ఇవ్వమని సిఎం చంద్రబాబు ఒత్తిడి:ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం
చిత్తూరు:జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి వైసిపి కార్యకర్తంటూ టిడిపి నేతల ఆరోపణల నేపథ్యంలో...శ్రీనివాస్ పనిచేస్తున్న ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ టిడిపికి చెందిన వ్యక్తే కాకుండా చంద్రబాబుకు సన్నిహితుడని వైసిపి నేతలు ప్రత్యరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై తీవ్రస్తాయిలో ఒత్తిడి తెచ్చారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్కే పురుషోత్తం చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆదివారం ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ హర్షవర్ధన్‌కు కొన్నేళ్లుగా టీడీపీతో సంబంధముందని...అతడు చంద్రబాబుతో కలసి ఆనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడని ఆరోపించారు.

ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ కు టిడిపి అధినేత చంద్రబాబు గాజువాక అసెంబ్లీ సీటు ఇవ్వాలని నిర్ణయించారని, అయితే అది కుదరకపోవడంతో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని భావించారని ఆర్కే పురుషోత్తం వెల్లడించారు. ఆ క్రమంలో ఇదే అంశంపై సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజమౌళి అనేకసార్లు తనకు ఫోన్ చేశారన్నారు.
అసలు హర్షవర్ధన్‌కు ఏ అర్హతా లేకపోయినా...అతడికి ఎపి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధతలు అప్పగించాలని సీఎం చంద్రబాబు ప్రయత్నించారని పురుషోత్తం చెబుతున్నారు. అసోసియేషన్‌తో సంబంధం లేకపోయినా సీఎం చంద్రబాబుతో కలిసి ఒలింపిక్ అసోసియేషన్ కార్యక్రమాల్లో హర్షవర్ధన్ చాలా సార్లు పాల్గొన్నారని వెల్లడించారు.
అలాగే అతడు ఎపి ఒలింపిక్ అసోసియేషన్ పేరుతో మరో అసోసియేషన్ పెట్టగా అతడికి అమరావతిలో ఆఫీసు ఇచ్చారని పురుషోత్తం ఆరోపించారు. అలాగే ఒక అసోసియేషన్ ఉండగా అందుకు పోటీగా మరో అసోసియేషన్ ను ఎలా ప్రోత్సహిస్తారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదని పురుషోత్తం చెప్పారు.