కాపు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో చర్చ...టిడిపి ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి:పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలకు దిశానిర్ధేశం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్లమెంటులో ప్రతి అవకాశం వినియోగించుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలని సిఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఇంతవరకు టిడిపి ఎంపిలు చేసిన పోరాటంపై ప్రజల్లో సంతృప్తి ఉందని చంద్రబాబు వారికి తెలిపారు. చట్ట ప్రకారం మన హక్కులు నెరవేర్చాలని, ప్రజలు కోరుకున్నది ప్రజా ప్రతినిధులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని టిడిపి ఎంపీలతో టెలీ కాన్ఫరన్స్ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు. పార్లమెంట్ లో చర్చనీయాంశాలపై త్రిసభ్య సంఘంతో ఎంపీలు సమన్వయం చేసుకోవాలని సిఎం చంద్రబాబు సూచించారు. కుటుంబరావు, బాలసుబ్రహ్మణ్యం, ప్రేమచంద్రా రెడ్డితో సంప్రదించాలని సీఎం ఎంపీలకు తెలిపారు.కేంద్రంలో బీజేపీ ఒంటెద్దు పోకడలను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలబడాలని, అల్ప సంఖ్యాకులకు అండగా ఉండాలని ఎంపీలకు వివరించారు.
మెజారిటీ కన్నా మొరాలిటీ ముఖ్యమనేది ఎంపీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బలమైన నాయకత్వాన్ని అణిచివేసే కుట్రను తిప్పికొట్టాలన్నారు. ప్రజా ఆకాంక్షల నెరవేర్పుకు టీఎంసీ, ఇతర భావస్వరూప్య పార్టీలతో కలిసి పని చేయాలని చంద్రబాబు సూచించారు. రాజకీయ లాభాల కోసం ప్రజల్లో అశాంతి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని సిఎం తెలిపారు. బిజెపి నేతలు ట్రిపుల్ తలాక్పైనా అప్పట్లో ఇలాగే చేశారని, సున్నితమైన అంశాలు ఏకపక్షంగా చేయడం మంచిది కాదని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కాపుల రిజర్వేషన్ల అంశాన్ని లోక్సభలో మరోసారి లేవనెత్తేందుకు టిడిపి సిద్ధమైనట్లు తెలిసింది. రిజర్వేషన్ల అంశాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపంలో సభ ముందుకు ఆ పార్టీ తీసుకువచ్చింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపంలో దీన్ని చర్చకు తీసుకువచ్చారు. లోక్సభలో ఈ అంశం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత చర్చకు వచ్చే అవకాశం ఉంది.
కాపులకు రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, దీనిపై ఆమోద ముద్ర వేసేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీలు అవంతి శ్రీనివాస్, తోట నర్సింహం ఇప్పటికే స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలవుతున్నాయని... అయితే ఏపీ విషయంలోనే కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని వారు మండిపడ్డారు.