బాబు ఎందుకలా చేశారు?: తప్పులో కాలేశారా.. దొంగ స్వామీజీతో ఇలానా?
విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పులో కాలేశారా?.. దొంగ బాబా పట్ల ఎందుకంత భక్తిని ప్రదర్శించారు?. ఓవైపు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలోనే చంద్రబాబు ఇలా మరో వ్యవహారంలో విమర్శలపాలవడం గమనార్హం.

ఇంతకీ ఏం జరిగిందంటే..
గత మంగళవారం ధర్మపోరాట సభ పురస్కరించుకుని విశాఖకు వచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన విమనాశ్రయంలో అడుగుపెట్టిన సమయంలో ఆయనకో స్వామిజీ ఎదురుపడ్డారు. తాను శంకర విద్యానంద సరస్వతినని, అమ్మవారి ఉపాసకుడినని సీఎంకు తనను తాను పరిచయం చేసుకున్నాడు.

ఒంగి ఒంగి నమస్కారాలు
స్వామిజీ తన వివరాలు చెప్పగానే చంద్రబాబు ఆయన పట్ల భక్తి శ్రద్దలు కనబరిచారు. ఒంగి ఒంగి ఆయన నుంచి ఆశీర్వచనాలు స్వీకరించారు. అంతా బాగానే ఉంది కానీ.. అసలు ఆ స్వామిజీ ఓ దొంగ అన్నది ఆ తర్వాత తేలిన వాస్తవం. దీంతో ముక్కూ ముఖం తెలియని బాబా పట్ల సీఎం ఇంత భక్తి శ్రద్దలు కనబరిచి సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్టు? అన్న విమర్శలు తలెత్తుతున్నాయి.

సదరు స్వామిజీ ఓ దొంగ
సదరు దొంగ స్వామిజీపై గతంలో పలు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. 2014 మే నెలలో పోలీసు జీపు నుంచి వైర్లెస్ సెట్, మైక్రో ఫోన్, వాకీటాకీ తదితర సామగ్రి అపహరించాడంటూ విశాఖ నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటికీ నడుస్తున్నట్టు తెలుస్తోంది.

పోలీస్ అంటూ బెదిరింపులు
మరో సందర్భంలో విశాఖ బీచ్‌రోడ్‌లో బ్లూలైట్ ఉన్న కారులో తిరుగుతూ తాను పోలీస్ అధికారినని పలువురిని బెదిరింపులకు గురిచేశాడు. ఇక ఇటీవల ఓ కారు షోరూమ్‌కు వెళ్లి ఐదు వేలు అడ్వాన్స్, మిగిలిన మొత్తానికి పోస్ట్‌డేటెడ్ చెక్‌తో కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఒక్క పైసా కూడా చెల్లించలేదు.
ఇలాంటి నేర చరిత్ర కలిగిన స్వామిజీలకు సీఎం ఇంత ప్రాముఖ్యం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థాయి వ్యక్తులే దొంగ స్వామిజీలను గుర్తించకపోతే... ఇక సామాన్యులు మాత్రం బురిడీ కొట్టరా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన ఘటనపై విశాఖ పోలీసులు విచారణ కూడా జరుపుతున్నట్టు సమాచారం.