సీఎం జగన్ రూ 25 లక్షల ఎక్సిగ్రేషియా - ఏలూరు అగ్ని ప్రమాదం : మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం..!!
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ఈ ప్రమాదం పైన ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి సూచించారు.


ఒక్కో కుటుంబానికి రూ 25 లక్షల పరిహారం
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చేలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్రమాదంలో గాయపడిన బాధితుల పరిస్థితి.. విషమంగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. గాయపడిన 12 మందిలో ఒకరు మినహా మిగిలిన వారందిరికీ 70 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయన్నారు. కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

మరి కొందరి పరిస్థితి విషమం
ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. సంఘటనా స్థలానికి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చేరుకుని, సంఘటన జరగటానికి కారణాలను విచారించి వివరాలను సేకరించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది ఉన్నట్టు సమాచారం. ఈ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు.

స్థానికులు ఆందోళన..పోలీసుల మొహరింపు
అయితే, మరణించిన వారిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు టిడిపి ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో..ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఫ్యాక్టరీని అక్కడ నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.