అమిత్ షా నుండి జగన్ కు పిలుపు: న్యాయశాఖ మంత్రితోనూ: ఆ అంశాలపైనే చర్చ..!
ఢిల్లీలో కేంద్ హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన వద్ద నుండి పిలుపు వచ్చింది. సోమవారం షాతో భేటీ కావాల్సి ఉన్నా అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా సాధ్యపడలేదని తెలుస్తోంది. దీంతో..మరి కాసేపట్లో ఆయన అమిత్ షా తో భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన కేంద్ర సాయం..పెండింగ్ అంశాలతో పాటుగా రాజకీయ పరిస్థితుల పైనా సీఎం జగన్ ఆయనతో చర్చించే అవకాశం ఉంది.
ఈ రోజు అమిత్ షా జన్మదినం కావటంతో జగన్ ఆయన్ను అభినందించనున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ తోనూ సమావేశం అవుతారు. ప్రధానంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్..అదే విధంగా కొత్తగా బెంచ్ ల ఏర్పాటు అంశం పైన చర్చించనున్నారు.
అమిత్ షా తో జగన్ భేటీ..
ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కీలకంగా మారుతోంది. అయిదు నెలల కాలంగా కేంద్రం..రాష్ట్రం మధ్య నడుస్తున్న పీపీఏల సమీక్ష వ్యవహారం పైన అమిత్ షా తో చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాన్ని ఆయనకు వివరించి..వచ్చే నెలలో ప్రాజక్టు పనులు ప్రారంభం కానుండటంతో..నిధుల అంశాన్ని.అదే విధంగా కొత్తగా మేఘా సంస్థకు పనులు అప్పగింత విషయం పైనా చర్చలు జరగనున్నాయి.

ఏపీ ఆర్దిక పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్రం నుండి రావాల్సి నిధులు..రెవిన్యూ లోటు భర్తీ చేయాలని జగన్ కోరనున్నట్లుగా సమాచారం. అయితే, టీడీపీ నేతలు మాత్రం జగన్ ది ఇది వ్యక్తిగత పర్యటన అని..తన పర్సనల్ సమస్యల పరిష్కారం కోసం అమిత్ షాతో కలవటానికి నిరీక్షిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే, సోమవారం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు..పోలింగ్ సరళి..సమాచార సేకరణలో భాగంగా కలవటం కుదరలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో..కొద్ది సేపటి క్రితం అమిత్ షా కార్యాలయం నుండి ముఖ్యమంత్రికి పిలపు వచ్చింది. ఇప్పుడు రాజకీయంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
హైకోర్టు తరలింపు అంశం పైనా చర్చ..
ఇక, అమిత్ షా తో భేటీ తరువాత ముఖ్యమంత్రి జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో సమావేశం కానున్నారు. ఏపీలో హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు.. అమరావతిలోనే కొనసాగించాలని కోస్తా ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. దీంతో.. ఏపీలో ప్రస్తుత హైకోర్టు తరలింపు తో పాటుగా రెండ బెంచ్ ల ఏర్పాటు పైనా ముఖ్యమంత్రి ఆయనతో చర్చించే అవకాశం ఉంది.

హైకోర్టు బెంచ్ ఉత్తరాంధ్ర తో పాటుగా హైకోర్టు తరలింపు ఆధారంగా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అందుకు తగిన విధంగా న్యాయమూర్తుల సంఖ్య లేదని సమాచారం. దీంతో..ఈ అంశం పైన కేంద్ర న్యాయశాఖా మంత్రితో చర్చ సమయంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రతిపాదనలు వివరించి..కేంద్రం చొరవ కోరనున్నారు. సాయంత్రానికి సీఎం జగన్ విశాఖ చేరుకొని..రాత్రికి అమరావతికి చేరుకుంటారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!