సీఎం జగన్ మేనమామ: పేద విద్యార్థులకు వరం, విద్యాకానుక ప్రారంభం.. సురేశ్ ఉద్వేగం..
విద్యా కానుక పథకం ద్వారా సీఎం జగన్ ప్రతి ఇంటికి పెద్దన్నలా నిలిచారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పథకాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పాఠశాలలను పట్టించుకోలేదని... కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటి రూపురేఖలే మారిపోయాయని చెప్పారు.

పేదరికం అడ్డుకాకుడదని..
చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే సీఎం జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పిల్లలందరికీ జగన్ మేనమామగా మారారని చెప్పారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం తమ కర్తవ్యం అని చెప్పారు. పిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యాకానుక పథకం ద్వారా రూ. 650 కోట్లు వ్యయం చేస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి రూ.1600 విలువైన కిట్ అందిస్తున్నామని తెలిపారు.

బడిబాట పట్టేందుకు చర్యలు
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే నాడు-నేడుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అమ్మ ఒడి ద్వారా పిల్లలు అందరూ బడిబాట పట్టేలా సీఎం జగన్ చేశారని సురేష్ తెలిపారు. తనకు ఇంత మంచి బాధ్యతను అప్పగించిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా కానుక ద్వారా ప్రతి ఇంటిలో తాను కుటుంబ సభ్యునిగా అయ్యారని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచడమే సీఎం జగన్ లక్ష్యం అని స్పష్టంచేశారు.

పూర్వజన్మ సుకృతం..
ఇంత మంచి బాధ్యత తనకు రావడం తాను చేసుకున్న పుణ్యం అని సురేశ్ తెలిపారు. విద్యార్థుల భవితను నిర్దేశనం చేయడంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని వివరించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని.. వారిపైనే దేశం అభివృధ్ది ఆధారపడి ఉందన్నారు. ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు అని.. వారు మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.

స్టూడెంట్ కిట్లు
రూ.650 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది బడి విద్యార్థులకు ‘స్టూడెంట్ కిట్లు' అందచేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాల నుంచి సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు, మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్, బెల్ట్, నోట్బుక్లు, స్కూల్‌బ్యాగ్ వంటి పలు రకాల వస్తువులని కొందరు చిన్నారులకు అందించారు.

ఏడు వస్తువులు
ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో తీసుకున్న చిన్నారులు మురిసిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాల కోసం బట్ట, బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు వారు చదువుతోన్న తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు.