ఏపీలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ .. ఎస్ఐపీబీ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 16,314 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు 39 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద పీట వేయాలని భావిస్తున్న జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

మూడు మెగా పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించిన ఎస్ఐపిబి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై సమీక్షించింది ఏపీ సర్కార్. సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న పలు పరిశ్రమల గురించి చర్చించారు. ఇంటెలిజెంట్ సెజ్, అదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు. అంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పరిశ్రమలు, ప్రభుత్వం నుండి అడుగుతున్న సహకారాన్ని, వారు కోరుకున్న రాయితీలను అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు.

చిత్తూరులో ఇంటిలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఏర్పాటు
పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించిన సీఎం జగన్ కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకే తొలి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి ఎస్ ఐ పి బి సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఇనగలూరులో ఇంటిలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, రెండు దశల్లో ఏడు వందల కోట్ల పెట్టుబడితో సిద్ధమైన కంపెనీ ద్వారా పదివేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.

విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ డేటా సెంటర్
ఈ కంపెనీ పులివెందులలో కూడా యూనిట్ ఏర్పాటు చేస్తుందని, ఆ యూనిట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలుస్తోంది.
విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ ను , ఇంటిగ్రేటెడ్ ఐటి అండ్ బిజినెస్ పార్క్ , రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ద్వారా 14, 634 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని , తద్వారా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.

విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఏటిసి ఏపీ ప్రైవేట్ లిమిటెడ్
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఏటిసి ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్ హైవే టైర్స్ యూనిట్ ఏర్పాటుకు 980 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఏటిసి సంస్థ ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్కార్ భావిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో పెట్టండి 3 మెగా పరిశ్రమల ద్వారా 39 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని, వాటి ద్వారా 16 వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తాయని సర్కారు భావిస్తోంది. ఇదే సమయంలో నైపుణ్య యూనివర్సిటీ ప్రతిపాదనల గురించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. విశాఖలో నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో ప్రతి ఏటా రెండు వేల మందికి శిక్షణ ఇచ్చేలా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.