ఎమ్మెల్యేలకు సీఎం జగన్ బంపరాఫర్ : దుల్హన్ - సీపీఎస్ పైనా తేల్చేసారు..!!
ఏపీలో రానున్న ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పారు. అదే సమయంలో..ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా ప్రభుత్వం పైన విమర్శలకు కారణమవుతున్న దుల్హన్ పథకం అమలు..సీపీఎస్ పైనా స్పష్టత ఇచ్చారు. ఏపీ కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత మంత్రులతో ఈ విషయాల పైన సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలె 95 శాతం పూర్తి చేసామని చెప్పుకొచ్చారు. ఇక, దుల్హన్ పథకం వైసీపీ ప్రభుత్వం ఆపింది కాదని.. 2017-18లో టీడీపీ ప్రభుత్వం ఆపివేసిందని వివరించారు. వేల మందికి పెండింగ్ పెట్టారని చెప్పారు. వాటిని క్లియర్ చేసి..కొత్తగా కొనసాగించాలంటే నిధులు సర్దుబాటు చేసుకోవాలని పేర్కొన్నారు.

దుల్హన్ పథకం.. ఏం జరిగింది
కానీ, వైసీపీ ప్రభుత్వమే ఆపేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని...గత ప్రభుత్వంలో ఎంత మందికి ఆపేసారు... పథకాన్ని కొనసాగించేందుకు ఎంత ఖర్చవుతుందనే అంచనా సిద్ధం అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని పథకాన్ని తిరిగి ప్రారంభిద్దామని సీఎం జగన్ మంత్రులతో వెల్లడించారు.
విద్యాదీవెనపై హైకోర్టులో జరుగుతుండటంతో దాని పైన చర్చకు వచ్చింది. ఏదో కొద్ది మందికి ఇలా పథకాలు ఇవ్వడమనేది మన ఉద్దేశం కాదు. విదేశీ విద్య అయినా, విద్యాదీవెనలాంటి పథకాలైనా శాచురేషన్ పద్ధతిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని..దీని కోసం ఒక సమగ్ర ప్రణాళికతో వెళదామంటూ సీఎం స్పష్టత ఇచ్చారు. ఇక.. సీపీఎస్ పైనా చర్చకు వచ్చినట్లు సమాచారం. సీపీఎస్ రద్దు చేస్తే 2035 నాటికి పెన్షన్ల భారం చాలా ఎక్కువగా ఉంటుందని.. ప్రభుత్వం నిర్వహణ పైనే ప్రభావం పడుతుందని విశ్లేషించినట్లు తెలుస్తోంది.

సీపీఎస్ లో ఉభయులకూ నష్టం లేకుండా
దీంతో..ఉద్యోగులకు నష్టం లేకుండా.. జీపీఎస్ ప్రతిపాదన చేశామన్నారు. ఉద్యోగుల నుంచి సానుకూల స్పందన వస్తే జీపీఎస్ అమలు చేస్తామని చెప్పారు. ఈ విధానం ఉద్యోగులకు మేలు చేస్తుందని సీఎం వివరించారు. ఇక.. ఎమ్మెల్యేలకు నియెజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.2కోట్లు ఇస్తామన్నారని, జీఓ మాత్రం రాలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దీని పైన ఒకటి లేదా రెండు రోజుల్లోనే జీవో జారీ చేయాలని సీఎం ఆదేశించారు. దీని పైన మంత్రులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేసారు. వీటికి స్పందనగా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు రెండు కోట్లు ఇస్తారని.. గడపగడపకు ప్రభుత్వం కింద గ్రామాల్లోకి వెళ్తున్న సమయంలో అక్కడ సమస్యల పరిష్కారానికి ఈ నిధులు ఖర్చు చేయాలని సూచించారు.

ఎమ్మెల్యేలకు నిధులపై హామీ
వెళ్లని ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేస్తే..మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పారు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆ రెండు కోట్లు పూర్తయితే.. జిల్లా కలెక్టర్ వద్ద మరో అయిదు కోట్లు ఉంటాయని వివరించారు. వాటిని వినియోగించుకొనే అవకాశం ఎమ్మెల్యేలకు ఉందని చెప్పుకొచ్చారు. అవి కూడా అయిపోతే మరో అయిదు కోట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలకు మేలు చేసే పనులు అయితే..సీఎం కార్యాలయానికి ప్రతిపదనలు పంపాలని సూచించారు. వాటిని పూర్తి చేసేలా చేద్దాం అంటూ సీఎం స్పష్టత ఇచ్చారు. దీంతో..ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్తున్న ఎమ్మెల్యేలకు సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారిన నిధుల అంశం పైన సీఎం స్పష్టత ఇవ్వటంతో ఎమ్మెల్యేలకు వెసులుబాటుగా మారుతుంది.