సీఎం జగన్ విదేశీ యాత్ర-స్పెషల్ ఏంటంటే : ఫోర్ డేస్ స్వీట్ మెమోరీస్..!!
నిత్యం సమీక్షలు-పాలనా వ్యవహారాలు-పార్టీ అంశాలతో బిజీగా ఉండే సీఎం జగన్ ఇప్పుడు ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తన కుమార్తెను కాలేజీలో చేర్చటం కోసం అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ టైం స్క్వేర్ లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా కారణంగా అప్పుడప్పుడు జిల్లా పర్యటనలే మినహా..పూర్తిగా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారానే అన్ని కార్యక్రమాలు-పధకాల ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇక, ఇప్పుడు జగన్ 27 నెలల పాలన తరువాత తొలి సారి కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లాలని నిర్ణయించారు.

జగన్ - భారతి మ్యారేజ్ డే..
ఈ నెల 28వ తేదీన జగన్-భారతి వివాహ వార్షికోత్సవం. ఈ ఏడాదితో వారి వివాహం జరిగి 25 ఏళ్లు అవుతోంది. 1996 ఆగస్టు 28న జగన్ - భారతి వివాహం జరిగింది. దీంతో..ఈ ఏడాది ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతోనే గడిపేందుకు ఈ యాత్రను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం ఈ నె 26న లండన్ -ప్యారిస్ వెళ్తున్నట్లు సమాచారం. తిరిగి 29న అమరావతి చేరుకోనున్నారు. జగన్ -భారతి కుమార్తెలు ఇద్దరూ హర్షా రెడ్డి- వర్షా రెడ్డి ఇద్దరూ ఉన్నత విద్య కోసం విదేశాల్లో ఉన్నారు. ఒక కుమార్తె వర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సాధించారు.

ఇద్దరు కుమార్తెలు ఉన్నత విద్యా సంస్థల్లో..
దీంతో..అప్పట్లో జగన్ కుటుంబం లండన్ వెళ్లి కుమార్తెను అక్కడ చేర్చారు. ఇక, మరో కుమార్తె హర్షారెడ్డి ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు సాదించారు. ఈ నాలుగు రోజులు తమ పిల్లలిద్దరితో కలిసి గడపనున్నారు. కరోనా కారణంగా వారి రాకపోకలు సాధ్యం కాలేదు. దీంతో..ఈ సందర్భాన్ని అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జగన్ కుమార్తెలిద్దరూ తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్ - భారతి ఇద్దరిదీ పులివెందులే. వైఎస్సార్ కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ కాగా.. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి ప్రముఖ డాక్టర్ గా ఉన్నారు.

జగన్ కష్టాల్లో తోడుగా భారతి..
జగన్ - భారతి ఇద్దరి వివాహం అయిన తరువాత వ్యాపార రీత్యా ఎక్కువగా బెంగుళూరులోనే ఉండేవారు. వైఎస్సార్ సీఎంగా ఉండగా సాక్షి మీడియా గ్రూపు ఏర్పాటు తరువాత జగన్ ఏపీలో ఎక్కువగా కనిపించేవారు. ఇక, భారతి సిమెంట్ కు భారతి డైరెక్టర్ గా పని చేసారు. వైఎస్సార్ మరణం తరువాత సాక్షి గ్రూపు భారతి ఛైర్మన్ అయ్యారు. జగన్ పైన కేసులు- జైలు శిక్ష సమయంలో భారతి కుటుంబానికి చెందిన మొత్తం వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించేవారు. తల్లి విజయమ్మ-చెల్లి షర్మిల పార్టీ - రాజకీయాల గురించి ఫోకస్ పెట్టగా..భారతి వ్యాపారాలను చూసుకొనే వారు. ఇక, ఇప్పుడు సైతం ఇందిరా మీడియా గ్రూపు- భారతి సిమెంట్ సంస్థలను భారతినే పర్యవేక్షిస్తున్నారు.

పూర్తిగా పర్సనల్ పర్యటనగా..
జగన్ సీఎం అయిన తరువాత కీలక వ్యక్తులను కలిసేందుకు-వచ్చిన వారిని ఆహ్వానించటంలో భారతి క్రియాశీలకంగా మారారు. ప్రతీ ఏటా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వివాహ వార్షికోత్సవం నిర్వహించుకొనే వారు. అయితే, ఈ సారి 25వ వార్షికోత్సవం కావటంతో ప్రత్యేకత సంతరించుకుంది. పూర్తిగా జగన్ తన వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటన ఖరారు చేసుకుంటున్నట్లు సమాచారం.