
ఎన్నికలపై సీఎం ప్రకటన - సెంటిమెంట్ కంటిన్యూ : విజయమ్మ క్లారిటీ - ప్లీనరీ షెడ్యూల్ ఇలా..!!
వైసీపీ ప్లీనరీ నిర్వహణకు రంగం సిద్దం అవుతోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటుగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ప్రతినిధుల సభ జరగనుండగా.. రెండో రోజు విస్తృత స్థాయి సమావేశం
జరగనుంది. ఇప్పటికే సమావేశాల నిర్వహణకు సంబంధించి కమిటీల ఏర్పాటు...మొత్తం 9 తీర్మానాల ఆమోదానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమావేశాల ముగింపు సమయంలో వైసీపీ అధినేత - సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు. అందులో కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమరశంఖం పూరించటంతో పాటుగా.. ఎన్నికలు ఎప్పుడు ఉండేదీ కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జగన్ సెంటిమెంట్ కంటిన్యూ
ఏదైనా ప్లీనరీ ద్వారానే ఇప్పటి వరకు జగన్ తన రాజకీయ ప్రణాళికలను ప్రకటిస్తూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం తరువాత పార్టీ తొలి ప్లీనరీని 2011 లో ఇడుపులపాయ కేంద్రంగా జూలై 8,9 తేదీల్లో నిర్వహించారు. ఆ తరువాత 2017 లో ప్రస్తుతం సమావేశాలకు సిద్దం అవుతున్న ప్రాంతంలోనే జరిగింది. 2017 ప్లీనరీ వేదికగా పాదయాత్రతో పాటుగా నవరత్నాలను రెండేళ్లు ముందుగానే ప్రకటన చేసారు. అదే వేదిక నుంచి తన రాజకీయ వ్యహకర్త ప్రశాంత్ కిశోర్ ను ప్లీనరీ వేదికగా పార్టీ శ్రేణులను పరిచయం చేసారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగించేలా జగన్ సిద్దమయ్యారు. విశాఖలో నిర్వహించాలని తొలుత భావించినా.. గతంలో నిర్వహించిన ప్రాంతంలోనే ప్లీనరీ జరుగుతోంది. అదే విధంగా... 2024లోనే ఎన్నికలు ఉంటాయా.. లేక, ముందస్తుగా ఎన్నికలు వెళ్లబోతున్నారా అనేది సీఎం జగన్ ప్లీనరీ వేదికగా క్లారిటీ ఇవ్వబోతున్నారు.

ఎన్నికల పైన క్లారిటీ ఇస్తారా
వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు ఉంటాయని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఈ రోజు కడప పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్ ..రాత్రికి ఇడుపుల పాయకు చేరుకుంటారు. రేపు ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి.. ప్లీనరీకి బయల్దేరనున్నారు. ప్లీనరీ కి నేరుగా హాజరు కానున్న సీఎం జగన్ 10.10 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. 10.50 గంటలకు పార్టీ అధ్యక్షుని ఎన్నిక ప్రకటనను పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేస్తారు. ఉదయం 11 గంటలకు జగన్ ప్రసంగిస్తారు. శుక్రవారం మహిళా సాధికారత - దిశ, విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ, వైద్యం, పరిపాలనలో పారదర్శకత... అనే ఐదు అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెట్టి ఆమోదిస్తారు. శనివారం ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొంటారు.

విజయమ్మ ప్రసంగంపై ఆసక్తి
జగన్ ముగింపు ఉపన్యాసం చేస్తారు. ఇప్పటికే సీఎం జగన్ పేరుతో కార్యకర్తలకు లేఖలు వెళ్లాయి. అందులో అన్నా..అక్కా అంటూ ప్లీనరీ నిర్వహణ అవసరం.. పాల్గొనాలంటూ లేఖలో ఆహ్వానించారు. ప్రతి ఊరికీ ప్లీనరీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ శ్రేణులకు ఆహ్వానాలు పంపారు. గ్రామ, వార్డు సభ్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ప్లీనరీకి ఆహ్వానిస్తూ పేరు పేరునా సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ఈ సమావేశాల్లో ఆమోదించే రాజకీయ తీర్మానంతో పాటుగా.. విజయమ్మ తన ప్రసంగంలో తమ సంబంధాల మధ్య జరుగుతున్న ప్రచారం పైన క్లారిటీ ఇవ్వనున్నారు. అదే విధంగా .. సీఎం జగన్ తన ముగింపు ప్రసంగంలో చేయబోయే కీలక ప్రకటన పైన పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కనిపిస్తోంది.