హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్-సోదరికి జూనియర్ అసిస్టెంట్ జాబ్...
గత నెలలో గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓదార్చారు. గురువారం(సెప్టెంబర్ 9) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రమ్య కుటుంబ సభ్యులు సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రమ్య హత్యోదంతాన్ని జగన్‌కు వివరించారు. ఆ కుటుంబం పరిస్థితి పట్ల జగన్ సానుభూతి వ్యక్తం చేశారు. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్యపై జాతీయ మహిళా కమిషన్ రియాక్షన్... డీజీపీకి లేఖ...
రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్ ఆమెకు అందాలని అధికారులకు సూచించారు. అంతేకాదు,రమ్య కుటుంబానికి ఐదెకరాల పొలం,ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రమ్య కుటుంబానికి ఇదివరకు రూ.10లక్షల చెక్కును హోంమంత్రి సుచరిత అందజేసిన సంగతి తెలిసిందే.

ఈ హత్య కేసులో నిందితులకు దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో ఉరిశిక్ష విధించాలని ప్రతిపక్ష నేత లోకేష్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ ఘటనపై ట్విట్టర్లో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'ఇంకా 3 రోజులే మిగిలాయి దళిత బిడ్డ రమ్యని దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపిన వాడికి ఉరి వేసేది ఎప్పుడు? దిశ చట్టానికి ప్రచారం అంటూ సొంత మీడియాకి యాడ్స్ ఇచ్చుకొని కొట్టేసిన రూ.30 కోట్లు పోలీసు వ్యవస్థ బలోపేతం కోసం వినియోగించి ఉంటే పరిస్థితి కొంతైనా మెరుగుపడేది సీఎం గారు.' అని లోకేష్ పేర్కొన్నారు.
మరోవైపు రమ్య హత్య కేసులో రాజకీయం తగదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.దోషులకు 21 రోజుల్లో శిక్ష పడేలా రూపొందించిన దిశ చట్టానికి కేంద్రం ఆమోద ముద్ర వేసే విధంగా టీడిపి ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుపై గతంలో జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. కమిషన్ ఛైర్ పర్సన్ రేశాశర్మ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని... తద్వారా మహిళా భద్రతకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు.
హత్య జరిగిందిలా...
గుంటూరులోని కాకాణి రోడ్డు మార్గంలోని పరామయకుంటలో ఆగస్టు 15, ఉదయం 10గంటల సమయంలో నల్లపు రమ్య హత్యకు గురైంది.ఇంటి నుంచి సమీపంలోని ఓ షాపుకు వెళ్లిన సమయంలో... ఓ యువకుడు అక్కడికి వచ్చి ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కత్తితో అతను దాడి చేసి పరారయ్యాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో రమ్య అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రమ్య శరీరంపై ఆరు కత్తిపోట్లను గుర్తించారు. రమ్యకు ఆ యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడటం... ప్రేమించాలని వేధించడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకుని దాడికి పాల్పడినట్లు తేలింది.
The family members of Ramya have called on Chief Minister @ysjagan garu today at CM camp office, tadepalli. Ramya parents Jyoti and Venkat Rao along with their elder daughter Mounika have briefed the Chief Minister about the incident happened to Ramya. pic.twitter.com/JkVGeAvomM
— Mekathoti Sucharitha (@SucharitaYSRCP) September 9, 2021