ఏపీలో వేగంగా పరిణామాలు-నిమ్మగడ్డ వద్దకు ఐఏఎస్‌ల్ని పంపిన జగన్- ఏం జరుగుతోంది ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయలో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఇవాళ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పంచాయతీ పోరు నిర్వహించాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ సర్కారుతో పాటు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు కమిషనర్‌ను తన వద్దకు పిలిపించుకున్న జగన్ తాజా పరిస్ధితిపై వారితో సమీక్షించారు. అనంతరం ఎన్నికల కమిషనర్ వద్దకు వెళ్లాలని వారిద్దరినీ జగన్ ఆదేశించారు. దీంతో పంచాయతీ పోరుపై ఉత్కంఠ మరింత పెరిగింది.
వేగంగా నిమ్మగడ్డ అడుగులు- ఎస్‌ఈసీ ఉద్యోగులతో సమీక్ష -రెండ్రోజుల్లో సీఎస్, డీజీపీతో

పంచాయతీ పోరుపై సుప్రీం విచారణ
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపుతున్న నేపత్యంలో ప్రభుత్వం వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అంతకంటే ముందే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాలు కూడా రిట్ వేశాయి. ఈ మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపుతుందో లేదో ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి పిటిషన్ వేస్తారా లేక పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ఇంకా తేలలేదు.

నిమ్మగడ్డ వద్దకు ఐఏఎస్‌లు- జగన్ ఆదేశం
పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘంతో సై అంటే సై అంటున్న పరిస్ధితుల్లో నెలకొన్న పరిస్ధితులపై కొద్ది సేపటి క్రితం సీఎం జగన్ పంచాయతీ రాజ్ శాఖ చూస్తున్న ఐఏఎస్‌లు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌ను పిలిపించుకుని మాట్లాడారు. సుప్రంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్, రేపు నోటిఫికేషన్ జారీకి ముంచుకొస్తున్న గడువు, గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ వంటి అంశాలపై చర్చించారు. చివరికి ద్వివేదీ, గిరిజాశంకర్ ఇద్దరినీ నిమ్మగడ్డ వద్దకు వెళ్లి కలవాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో ప్రభుత్వం ఎన్నికల విషయంలో ఏ నిర్ణయం తీసుకుందన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది.

పంచాయతీ పోరుపై జగన్ రాజీ పడతారా ?
సీఎం జగన్ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మధ్యాహ్నం నిమ్మగడ్డతో ఆయన కార్యాలయంలో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్ధితులను సైతం ఆయనతో పంచుకోనున్నారు. అయితే ఎన్నికల నిర్వహణకు వేగంగా పావులు కదుపుతున్న నిమ్మగడ్డతో వీరి భేటీ దేనికి సంకేతం అన్న చర్చ మొదలైంది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం రాజీ పడాలని నిర్ణయించుకుందా అన్న అనుమానాలూ నెలకొన్నాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగి వెంటనే తీర్పు వస్తుందన్న గ్యారంటీ లేకపోవడం, తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ కు సమయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వం రాజీకి సిద్ధపడుతుందా అన్న చర్చ సాగుతోంది.