నెల్లూరు వైసీపీ విభేదాలకు తాత్కాలిక బ్రేక్-కాకాణి, అనిల్ కు సీఎం జగన్ క్లాస్
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికీ, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూ మధ్య బయటపడిన విభేధాలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వీరిద్దరినీ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ కోసం విభేదాలు వీడి పనిచేయాలని సూచించారు.
జగన్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏప్రిల్ 17న నెల్లూరు సిటీకి వచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైసీపీ నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. తన నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి కౌంటర్ గా కార్యకర్తలతో అదే రోజు అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేధాలు బయటపడ్డాయి. ఈ పోటీ సభలపై అధిష్టానం గుర్రుగా ఉన్నా ఇద్దరూ వెనక్కితగ్గలేదు. అలాగే ప్రత్యర్ధి నేతలపై కామెంట్స్ కూడా ఆపడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఇవాళ వీరిద్దరితో మాట్లాడారు.

సీఎం జగన్తో మంత్రి కాకాణి గోవర్దన్ సమావేశం తర్వాత బయటికి వచ్తి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎలా పనిచేశారో... అలాగే ఇప్పుడు పనిచేసుకోమని సీఎం చెప్పారని కాకాణి తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాను జిల్లాకు మంత్రి అయితే అనిల్ కుమార్ మాజీ మంత్రి అని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సభ పెట్టుకుంటే తప్పేంటి? అని ఎదురు ప్రశ్నించారు. పోటాపోటీ సభలు అనేది అవాస్తవమన్నారు. తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవద్దన్నారు. మీడియా అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా నిప్పు లేకుండానే పొగ వస్తుందని కాకాణి చెప్పారు. అనిల్ కుమార్, తాను వెళ్లి కలవడం వెనుక ప్రత్యేక ఉద్దేశాలేమీ లేవని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ మధ్య గొడవలు సృష్టించేందుకు కొందరి ప్రయత్నం చేస్తున్నారని కాకాణి గోవర్దన్ విమర్శించారు.