మంత్రులతో తేల్చేసిన సీఎం జగన్ -టీడీపీ వారితోనూ మాట్లాడండి : మీ మనుషులను పంపడమేంటి...!!
ముఖ్యమంత్రి జగన్ కొత్త మంత్రులకు దిశా నిర్దేశం చేసారు. తన ఆలోచనలను స్పష్టం చేసారు. సుతిమెత్తని హెచ్చరికలు చేసారు. ఖచ్చితంగా ప్రతీ మంత్రి బాధ్యత తీసుకోవాలని తేల్చి చెప్పారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ జరిగింది. అధికారిక అజెండా ముగిసిన తరువాత..మంత్రులతో సీఎం రాజకీయ అంశాలను ప్రస్తావించారు. మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం గురించి కీలక సూచనలు చేసారు. ఈ కార్యక్రమం అవసరం..తాను ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మంత్రులకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం వారికి ఏం చేసిందో వివరాలతో సహా చెప్పాలని మంత్రులకు సూచించారు.

బాధ్యత మీదే - ఓట్లు మీకే
ప్రజల వద్దకు వెళ్లాల్సింది మీరే...ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.. తిరిగి ఓట్లు వేయాల్సింది మీకే ..అటువంటి ఉద్దేశం తో ఖరారు చేసిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి మీరు వెళ్లకపోవటం ఏంటని సీఎం మంత్రులను నిలదీసారు. మీ మనుషులను పంపటం ఏంటని ప్రశ్నించారు. ప్రతీ మంత్రి..ప్రతీ ఎమ్మెల్యే ఈ కార్యక్రమం లో పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పారు. గడప గడపకు వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం వారికి ఏం చేసిందో వివరించాలని స్పష్టం చేసారు. ఎవరైనా ప్రశ్నించినా.. పథకాలు రాలేదని చెప్పినా... సమస్యలను ప్రస్తావించినా వారికి సమాధానం చెప్పి..సమస్య పరిష్కరించేలా చర్యలు సూచించాలని నిర్దేశించారు. ప్రశ్నిస్తున్న వారికి ప్రభుత్వం ఏం చేసిందో.. ఏ రకంగా ప్రతీ ఇంటికి మేలు చేస్తుందో వివరించండి అంటూ స్పష్టం చేసారు.

టీడీపీ మద్దతుదారులను కలుపుకు పోండి
టీడీపీ మద్దతు దారులు కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలను అడ్డుకొని నిలదీస్తున్నారని..దానిని ప్రజలే అడ్డుకున్నట్లుగా ప్రచారం జరుగుతుందనే అంశం పైన ఈ భేటీలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, దీనికి స్పందనగా... తెలుగు దేశం మద్దతుదారులు ప్రశ్నిస్తే వారితోనూ మాట్లాడండి... అడ్డుకొనే ప్రయత్నం చేస్తే వారికి వివరించండి... వారి ఇళ్లకు ప్రభుత్వం నుంచి అందిన ప్రయోజనం ఏంటో వివరించి చెప్పండంటూ మంత్రులకు సీఎం జగన్ స్పష్టం చేసారు. ప్రతీ ఎమ్మెల్యే..మంత్రి ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఏ విధంగా కార్యక్రమం కొనసాగుతుందో పార్టీ సమన్వయ కర్తలు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని సీఎం చెప్పుకొచ్చారు.

ఎవరికీ మినహాయింపు లేదు.. పార్టీ ఉంటేనే
పార్టీ ఉంటేనే అందరం ఉంటామనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలని స్పష్టం చేసారు. మంత్రులు ఏ జిల్లాల్లో ఇన్ఛార్జులుగా ఉన్నారో..అక్కడ ఈ కార్యక్రమం నిర్వహణ తీరును పర్యవేక్షిస్తూనే... సొంత జిల్లాల్లో..అదే విధంగా సొంత నియోజకవర్గాల్లో పర్యటలు చేయాలని ముఖ్యమంత్రి తన సహచర మంత్రులకు తేల్చి చెప్పారు. అయితే, గడప గపడకూ ప్రభుత్వం కార్యక్రమంలో రెండో రోజు సైతం అధికార పార్టీ నేతలను పలు ప్రాంతాల్లో అధిక ధరలు.. రోడ్ల నిర్వహణ.. స్థానిక అంశాల పైన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు...నేతలు మాత్రం ప్రధానంగా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ..లబ్ది దారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనేందుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్.. దీని ఆధారంగానే ప్రజలతో ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో మమేకం అవుతున్నారు..వారికి సర్వేల్లో వచ్చిన ర్యాంకింగ్ ఆధారంగా టిక్కెట్లు ఖరారు చేస్తాననే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసారు. దీంతో.. ఇప్పుడు ఈ కార్యక్రమం మంత్రులు - ఎమ్మెల్యేల సమర్ధతకు పరీక్షగా మారుతోంది.