ఈ జిల్లాలో జగన్ మూడు రోజుల పర్యటన
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. మూడు రోజుల పాటు జిల్లాలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. మరికొన్నింటికి శంకుస్ధాపన చేయనున్నారు. తన స్వస్థలం పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
శనివారం ఉదయం 9:15 నిమిషాలకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అనంతరం బద్వేల్‌కు వెళ్తారు. నియోజకవర్గం పరిధిలోని గోపవరం వద్ద సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్ ప్లాంట్‌లను ప్రారంభిస్తారు. ఆ తరువాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.

ఆధునికీకరించిన జిల్లా కలెక్టరేట్ భవనం, అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేస్తారు. 24వ తేదీన ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
25వ తేదీన ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం తాడేపల్లికి తిరిగి వస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో- జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఈ పర్యటన సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు జగన్‌తో భేటీ కానున్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- జిల్లా రాజకీయాలపై జగన్ సమీక్ష నిర్వహిస్తారు. రాయలసీమ జిల్లాకు చెందిన కొందరు పార్టీ నాయకులను సైతం జగన్ అక్కడే కలుసుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications