
ఆ పథకం కింద రూ.694 కోట్లు విడుదల చేయనున్న వైఎస్ జగన్
రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. మదనపల్లికి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తన పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద నాలుగో విడతగా ఆయన నిధులు మంజూరు చేయనున్నారు. అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందజేయడానికి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకం ఇది.

ఇవ్వాళ రూ.694 కోట్లు..
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 11.02 లక్షల మంది విద్యార్థులు లబ్ది కలుగుతోంది. ఇవ్వాళ నాలుగో విడత కింద 694 కోట్ల రూపాయలను వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బదలాయిస్తారు. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులు ఇవి.

ఇప్పటివరకు 12 వేల కోట్లకు పైగా..
ఇప్పటివరకు విద్యా దీవెన కింద 9,052 కోట్లు, వసతి దీవెన కింద 3,349 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రెండు పథకాల కింద ప్రభుత్వం మొత్తంగా 12,401 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి సహకరించేలా ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేస్తోంది. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ వర్తింపజేసేలా వీటి విధి విధానాలకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఈ రెండింటి పథకాల ప్రయోజనం పొందడానికి అర్హలుగా గుర్తించింది.

గత ప్రభుత్వ బకాయిలు కూడా..
వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు విడతలుగా 10,000 రూపాయలను మంజూరు చేస్తోంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వారికి 20,000 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. గత ప్రభుత్వం 1,778 కోట్ల రూపాయల మేర బకాయిలను పెట్టింది. ఈ మొత్తాన్ని కూడా ఇదివరకే జగన్ సర్కార్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

తొలిసారి అన్నమయ్య జిల్లాకు..
రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తరువాత వైఎస్ జగన్ ఇక్కడికి రాబోతోండటం వైఎస్ జగన్‌కు ఇదే తొలిసారి.
దీనితో ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీ గిరీషా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నవాజ్ భాష ఏర్పాట్లను పర్యవేక్షించారు.

షెడ్యూల్ ఇదీ..
ఈ ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 11:10 నిమిషాలకు మదనపల్లికి చేరుకుంటారు. బీటీ కళాశాల గ్రౌండ్స్‌లో అధికారులు హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అనిబిసెంట్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్డు మీదుగా 11:30 గంటలకు టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:45 నిమిషాలకు బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.