ఏపీలో పన్నులబాదుడుపై సామాన్యుడి ఆవేదన-ఏమన్నాడో తెలుసా ? ట్వీట్ చేసిన చంద్రబాబు
ఏపీలో ఈ ఏడాది వరుస పన్నుల పెంపుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఏడాదిలోకి వెళ్లేందుకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ప్రభుత్వం పన్నుల పెంపుపై తొందరపడుతోంది. దీంతో ప్రభుత్వం పెంచుతున్న పన్నులపై సామాన్యుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో విజయవాడ వాసి ఒకరు పన్నుల పెంపుపై సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. దీన్ని విపక్ష నేత చంద్రబాబు ట్వీట్ లో షేర్ చేశారు.

ఏపీలో పన్నుల బాదుడు
ఏపీలో ఈ ఏడాది ప్రభుత్వం వరుసగా పన్నులు పెంచుతూ పోతోంది. ఆస్తిపన్ను 15 శాతం పెంపుతో పాటు అద్దె వెలువ స్ధానంలో రిజిస్ట్రేషన్ విలువకు మార్చడంతో భారం మరింత పెరిగింది. చెత్తపన్ను కొత్తగా విధిస్తున్నారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు వరుసగా పెంచారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరిగింది. కేంద్రం చెప్తున్నా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించడం లేదు. దీంతో వరుసగా పెరుగుతున్న పన్నులు సామాన్యుల్ని కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటి ద్వారా వస్తున్న డబ్బులు కాస్తా పన్నుల రూపంలో తిరిగి లాగేసుకుంటుందన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.

సామాన్యుడి ఆవేదన
రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఆస్తిపన్నుతో పాటు చెత్తపన్నుల్ని బాదడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో పన్నుల బాదుడు ఎలా ఉందో వివరిస్తూ ఓ విజయవాడ వాసి చేసిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, లైబ్రరీ టాక్స్, అనాథరైజ్డ్ పెనాలిటీ, టాక్స్ ఎరియర్స్ ఇంట్రస్ట్ పేరుతో తనకు పన్నులు ఎలా వడ్డించారో విజయవాడ వాసి తన వాయిస్ మెసేజ్ లో తెలిపారు.
ముఖ్యంగా గతంలో రూ.3000ల రూపాయలుగా ఉన్న ఇంటి పన్ను కాస్తా రూ.5700 లకు చేరడంపై తన ఆవేదన వెళ్లగక్కాడు. భారీగా పెరిగిన పన్నులతో పేద, మద్య తరగతిపై పడుతున్న భారం అంటూ సదరు వ్యక్తి వాయిస్ మేసేజ్ పెట్టారు.
ట్వీట్ లో షేర్ చేసిన చంద్రబాబు
మునిసిపాలిటీ పన్నుల బాదుడుపై విజయవాడ వాసి ఆవేదనను టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. పన్నుల బాదుడు ఎలా ఉందో వివరిస్తూ విజయవాడ వాసి చెప్పిన వాయిస్ మెసేజ్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా! ఇదేం బాదుడు...ఇదేం పాలన? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పన్ను పోటుపై ప్రజల ప్రశ్నలకుబదులివ్వండి. లేదా అసత్య హామీలు, నిత్య మోసాలపై క్షమాపణలు చెప్పండని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. దీంతో చంద్రబాబు ట్వీట్ వైరల్ అవుతోంది.