అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకయ్య ఉద్వేగం: రాజధాని, ప్యాకేజీ, జై ఆంధ్ర ఉద్యమంపై బెజవాడలో వివరణ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నాయకులు కన్నా ప్రజలు చాలా తెలివైన వారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తెచ్చినందుకు వెంకయ్య నాయుడుకి విజయవాడలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభలో వెంకయ్య మాట్లాడుతూ ప్యాకేజీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు.

విజయవాడకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగాలాండ్‌, మిజోరాం, అసోం, సిక్కిం వంటి రాష్ట్రాలు వెన‌క‌బ‌డి ఉన్నాయని, కొండ ప్రాంతాల‌యిన హిమాచ‌ల్, జ‌మ్ముక‌శ్మీర్ వంటి రాష్ట్రాల‌ను ప్ర‌త్యేకంగా చూడాల‌ని వాటికి హోదా ఇచ్చారని పేర్కొన్నారు. అభివృద్ధికి అవకాశం లేని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకహోదా వర్తిస్తుందన్నారు.

venkaiah naidu

ప్యాకేజీపై విమర్శలు తిప్పికొట్టినందుకే విజయవాడకు వచ్చా
అటవీ ప్రాంతాలకు మాత్రమే హోదా ఇస్తారన్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తారన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై విమర్శలు తిప్పికొట్టినందుకే విజయవాడకు వచ్చానన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక ప్యాకేజీతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చెప్పారు.

1972లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉంటే దాని ముఖచిత్రమే మారిపోయి ఉండేదన్నారు. ప్యాకేజీపై అవగాహన కల్పించేందుకు ఈ సభ అని అన్నారు. విద్యార్ధి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న మాట వాస్తవేమన్నారు. ఎందుకంటే ప్రజలంటే ప్రజలపై తనకెంతో విశ్వాసం ఉందన్నారు.

కాంగ్రెస్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను భ్ర‌ష్టుప‌ట్టించింది
2004 నుంచి 2014 వ‌రకు కాంగ్రెస్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను భ్ర‌ష్టుప‌ట్టించిందని ఆయ‌న అన్నారు. 2004లో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో తెలంగాణ తెస్తామ‌ని కాంగ్రెస్ చెప్పింద‌ని అన్నారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ ఈ అంశంపై తీర్మానం చేశాక అన్ని పార్టీలు తెలంగాణ ఏర్ప‌డాల‌ని ఉత్త‌రాలు ఇచ్చాయ‌ని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడిచి వెళ్తున్నారని, విజయవాడలో ఓ బహిరంగ సభ పెట్టేందుకు వచ్చామన్నారు. అనంత‌రం కాంగ్రెస్ ఆ అంశాన్ని ప‌క్క‌న‌పెట్టేసింద‌ని చెప్పారు. 2014లో తెలంగాణ ఇచ్చే ముందు కాంగ్రెస్ ర‌హ‌స్య‌స‌ర్వే చేసింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందడానికే రాష్ట్ర విభ‌జ‌న చేశార‌ని పేర్కొన్నారు.

జై ఆంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చారు
జై ఆంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏపీ ఉద్యమం ఊపందుకున్న వేళ కాంగ్రెస్ నేతలు జనాన్ని నమ్మించడానికి ఎన్నో మాటలు చెప్పారన్నారు. ఈ సందర్భంగా ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ ఏపీ వచ్చేంత వరకు తన పెళ్లాం దగ్గరకు కూడా వెళ్లనని చెప్పాడని అన్నారు.

ఏపీ రావడానికి ఆయన పెళ్లాం వద్దకు వెళ్లకపోవడానికి కారణం ఏంటయ్యా? అని ఆరోజు తాను అడిగానన్నారు. తెలంగాణ ఏర్పాటు కావాలని అన్ని పార్టీలు కూడా లేఖలు ఇచ్చాయన్నారు. ఏపీలో త‌మ పార్టీ ప‌రిస్థితి బాగోలేద‌ని తెలుసుకొని తెలంగాణ నుంచి సీట్లు పొంద‌వ‌చ్చ‌ని ఆశించే కాంగ్రెస్ విభ‌జ‌న చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌న్నారు.

ఇందిరమ్మ, ఎన్టీఆర్ గాల్లో గెలిచా
తాను ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేదని కొందరు అంటున్నారని, అలా అంటున్న వారు పుట్టక ముందే తాను రాజకీయాల్లో గెలిచానన్నారు. 1978లో ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న క్రమంలో నెల్లూరు జిల్లాలో ఉన్న 11 సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, బీజేపీ ఒక్క సీటు గెలిచిందన్నారు. అదే విధంగా 1983లో ఎన్టీఆర్ గాల్లో కూడా 11 సీట్లలో 10 సీట్లు టీడీపీ గెలిస్తే, ఒక సీటు బీజేపీ గెలిచిందన్నారు. ఇలా రెండు సార్లు ఇందిరమ్మ, ఎన్టీఆర్ గాల్లో తానొక్కడనే గెలిచానన్నారు.

ఏపీని కాంగ్రెస్ దగా చేసింది
ఆనాడు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు కాదు ప‌దేళ్ల‌ని చెప్పింది తానేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. హోదా అంశాన్ని కాంగ్రెస్ విభ‌జ‌న‌ చ‌ట్టంలో చేర్చ‌లేదని పేర్కొన్నారు. రాజ్య‌స‌భ‌లో ఆరోజు చర్చ స‌జావుగా జ‌రిగి ఉంటే ఏపీకి ఇప్పుడు ఇలాంటి తిప్ప‌లు ఉండేవ కాద‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కాంగ్రెస్ చెబుతోందన్నారు. కానీ పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కేంద్ర మంత్రి ఎవరో కాదు వీరప్పమెయిలీ ఏపీకి రాయితీలిస్తే ఒప్పుకోలేదన్నారు. టీవీ ప్రసారాలను ఆపేసి తమ సభ్యులను బయటకు పంపేసి బిల్లు పాస్ చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. పాపం కాంగ్రెస్ చేస్తే నింద నాపై మోపారన్నారు.

కొందరు నా పంచెపై మాట్లాడారు
కొందరు నాయకులు నా పంచెపై మాట్లాడుతున్నారు. రాజకీయాలు దిగజారిపోడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. నేను ఏపీ ఎంపీని కాదు, నేను ఏపీ నుంచి ఎన్నిక కాకపోయినా, ఏపీ అభివృద్ధికి తోడ్పడుతున్నానన్నారు. విభజన జరిగిపోయిందని, ఏపీ అభివృద్ధే మా లక్ష్యమన్నారు. అలాగే నేను పక్క రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికవడాన్ని కూడా తప్పుబట్టారన్నారు.

ఏపీ కోసం 38 మంత్రులను పిలిచాను
విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు 38 మంత్రులను పిలిచి మాట్లాడానన్నారు. కేంద్ర మంత్రులను పిలిచే అధికారం కేవలం ప్రధాన మంత్రికి మాత్రమే ఉందన్నారు. కానీ 38 మంత్రులను పిలిచి ఏపీకి చేయాల్సిన సాయంపై ఎప్పటికప్పుడు సమీక్షించానన్నారు.

విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మాటిచ్చానని, మంత్రులందరికీ లేఖలు రాస్తే వాళ్లంతా కూడా ఏపీకి ఎంతో ఉదారంగా సాయం చేశారన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఏపీకి సాయం చేస్తామన్నారు.

నా భార్య కూడా అడిగింది
ఏపీ ప్యాకేజీపై తనపై వస్తున్న విమర్శలను టీవీలో చూసి తన భార్య కూడా మనకు ఎందుకని అడిగిందని అన్నారు. అయితే ఈ భూమిలో పుట్టానని ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలని తాను చెప్పానన్నారు. విమర్శుల చేసే వారు ఎప్పుడూ చేస్తుంటారని, కానీ వాటిని పట్టించుకోకూడదని, వాళ్ల సర్టిఫికేట్ అవసరంలేదని ప్రజల సర్టిఫికెట్ ముఖ్యమన్నారు. నేను కర్మాటక నుంచి ఎంపీనైనా ఏపీ కోసం ఎంతో పోరాడానని చెప్పుకొచ్చారు.

మంత్రినైన మొదటి రోజు నుంచి ఏపీకి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా
ఎన్టీఏ ప్రభుత్వంలో మంత్రినైన మొదటి రోజు నుంచి ఏపీకి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా చెప్పారు. ఏపీకి అన్ని విధాగాలుగా అభివృద్ధి చేసేందన్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్నో ప్రఖ్యాత విద్యాసంస్ధలను నెలకొల్పామని, మరికొన్ని నెలకోల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వాటికి సంబంధించిన వాటిని చదివి వినిపించారు. అమరావతి నిర్మాణానికి డబ్బు ఇద్దామన్నా, ప్లాన్ లేకపోవడంతో నిధులు ఇవ్వలేదన్నారు.

పురంధేశ్వరి అర్థం చేసుకున్నారు
తాను ప్ర‌త్యేక హోదా లేదా ప్యాకేజీ కోసం చేస్తోన్న ప్ర‌య‌త్నంలో త‌న మాట‌ల‌ను బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలు పురంధేశ్వ‌రి అంద‌రి కంటే ముందుగా అర్థం చేసుకున్నార‌ని ఆయ‌న అన్నారు. క‌నీసం పోల‌వ‌రం ప్రాజెక్టు కోస‌మైనా ప‌ట్ట‌బ‌డాల‌ని ఆమె త‌న‌ను కోరిన‌ట్లు చెప్పారు. చివ‌రికి పోల‌వరం సాధ్య‌మైంద‌ని చెప్పారు.

ఏపీకి న్యాయం జరగాలని అద్వానీకి తాను ముందే చెప్పా
ఆంధ్రా ఉద్య‌మాన్ని నీరుగార్చింది కాంగ్రెస్సేన‌ని అన్నారు. అన్ని అంశాల‌ను ప‌రిశీలించ‌కుండా కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌న చేసింద‌ని చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ తెచ్చినందుకు దాని ప‌ట్ల ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. విభ‌జ‌నకు తాను అనుకూల‌మే కానీ ఏపీకి న్యాయం జ‌ర‌గాల‌ని ఆనాడు ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు వెంక‌య్య‌ తెలిపారు. ఏపీకి న్యాయం జ‌రిగేవ‌ర‌కు వెన‌కాడేది లేద‌ని అద్వానీకి తాను ముందే చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

ఏపీకి ఏం కావాలో అడ‌గాలని సూచించా
విభ‌జ‌న జ‌ర‌గ‌బోతోందని, ఏపీకి ఏం కావాలో అడ‌గాల‌ని రాష్ట్ర‌ కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఆనాడే తాను సూచించిన‌ట్లు వెంక‌య్య‌ తెలిపారు. కానీ త‌న‌ మాట‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు విన‌లేదని పేర్కొన్నారు. ఆనాడు జైరాం ర‌మేశ్‌తో క‌లిసి తాను ఏడు రోజులు చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఏం చేర్చాలో చెప్పిన‌ట్లు తెలిపారు. కేంద్రం ప్ర‌క‌టించిన‌ ప్ర‌త్యేక సాయంతో రాష్ట్రానికి ఎంతో క‌లుగుతుంద‌ని అన్నారు.

చంద్రబాబుకు చెప్పా, ఎన్టీఆర్ పక్కన నిలబడ్డా
కేంద్రం ప్రకటించే ఆర్ధిక సాయంపై ఆలోచించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముందుగానే చెప్పానన్నారు. కామీ మా మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఆ లోపాయకారి ఒప్పందం ఏంటే చెప్పాలని మండిపడ్డారు. పెద్దాయన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు అన్యాయం జరిగింది కాబట్టే ఆయన పక్కన నిలబడ్డాన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు హోదాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హోదాను చట్టంలో చేర్చకపోతే ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు.

దాయాదుల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు
నేను కర్ణాటక నుంచి ఎంపీగా ఎన్నికయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల గురించే ఆలోచిస్తుంటానన్నారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు కేబినెట్‌లో చర్చిస్తున్నానన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టే కలిసుండి కొట్టుకోవడం కంటే విడిపోయి అభివృద్ధి చెందడం మంచిదని భావించానన్నారు. కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ దాయాదుల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదని సూచించాన్నారు.

చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకుని ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించానన్నారు. ఇక్కడున్న 30 శాతం మంది ప్రజలు ఈ ప్రాంతం నుంచి హైదాబాద్ వెళ్లారన్నారు. భార్య భర్తల మధ్య, కుటుంబంలో కూడా కలహాలు ఉంటాయని చెప్పిన వెంకయ్య అలాగే రాష్ట్ర సమస్యలను కూడా పరిష్కరించుకోవాలన్నారు.

విజయవాడ నుంచే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నానని చెప్పారు. ఏపీలో విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే విప్స్, కామన్ వెల్త్ స్పీకర్స్, ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ, బ్రిక్స్ మీటింగ్ లాంటివి అక్కడ జరిగేలా చూశామన్నారు. ఈనెల 23వ తేదీన అంతర్జాతీయ సీ పుడ్ ఫెస్టివల్‌ను కూడా అక్కడే జరుపనున్నట్లు తెలిపారు.

విజయవాడ, గుంటూరు కూడా త్వరగా అభివృద్ధి చెందితే ఇక్కడ కూడా మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. బందర్ రోడ్డు రోడ్ల వెడల్పు, దుర్గ గుడి ప్లైఓవర్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడానన్నారు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి కూడా కేంద్రం సాయం చేస్తుందన్నారు.

రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టమని చెప్పా
ఏపీ రాజధానిని వినుకొండ, దొనకొండలలో పెడతారంటే వద్దని విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టమని చంద్రబాబుకు సూచించానన్నారు. ఎందుకంటే రాజధాని కావాలంటే కొన్ని హంగులు ఉండాలన్నారు. విద్యాసంస్ధలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాంనంగా అందుబాటులో ఉండాలన్నారు.

కొంతమందికి బందర్ రోడ్డు, బీసెంట్ రోడ్డుకు వెళ్లి టీ, సమోసా తినే అలవాటు ఉంటుందని వెంకయ్య చెప్పారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని సూచించారు. తాను ఏపీకి ఎంపీని కాకపోయినా ఏపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానన్నారు. మనకు ఐడియాలు ఉంటే సరిపోదని మన దగ్గర కూడా ఆదాయం ఉండాలన్నారు. ప్యాకేజీపై కొందరు కావాలని పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

English summary
Complimentary house for venkaiah naidu at vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X