అమరావతి నాటి వైభవం .. నేటి దుస్థితి .. శంకుస్థాపన ప్రాంతంలో రాజధాని రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్ళు. ఈ ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో పరిపాలనకు సంబంధించిన పలు భవనాలు నిర్మాణం కాగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాడు టీడీపీ హయాంలో రాజధాని అమరావతి ఒక వెలుగు వెలుగుతుంది అని చెప్పగా, నేడు రాజధాని ప్రాంతం ప్రశ్నార్ధకంగా మారింది.
అమరావతి శంకుస్థాపనకు నేటితో ఐదేళ్ళు... నాడు రైతుల హర్షం .. నేడు కన్నీటి వర్షం

ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన ప్రాంతంలో వినూత్న నిరసనలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో అమరావతి ప్రాంత రైతులు 310 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
నేడు ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిపి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టారు . మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రాజధాని గ్రామాల్లో రైతులు మహిళలు, జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి నాటి వైభవం నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మోడీ శంకుస్థాపన జరిగిన చోటే ఆందోళనలు .. సర్వమత ప్రార్ధనలు
ఉద్దండరాయునిపాలెం లో అమరావతి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. నాటి శంకుస్థాపనకు గుర్తుగా , నేడు దయనీయ పరిస్థితులు తెలియజేసేలా ఆందోళనలకు నిర్ణయం తీసుకున్నారు . రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ఉదయం తొమ్మిది గంటలకు రాయపూడి మండలం నుండి పాదయాత్రగా శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకుని, సర్వమత ప్రార్థనలు సాగిస్తున్నారు. రాజధాని ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .

అమరావతి చూపు మోడీవైపు పేరుతో వినూత్ననిరసన .. రాత్రికి కాగడాల ప్రదర్శన
అమరావతి చూపు మోడీవైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేపట్టనున్నారు. రాత్రికి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాలను ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు .రాజధాని శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ కలగజేసుకోవాలని రాజధాని ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నాడు ఎంతో గొప్పగా నీళ్ళు, మట్టి తెచ్చి శంకుస్థాపన చేసిన మోడీ ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంత పరిస్థితిని చూడాలని, అమరావతినే రాజధానిగా ఉండేలా చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు .