మళ్లీ తెరపైకి నిమ్మగడ్డ లేఖ: ఆ ముగ్గురిపైనే విజయసాయిరెడ్డి అనుమానం: విచారణ జరిపించాలంటూ..!
అమరావతి: గత నెలలో తాజా మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించడం అది కాస్త కోర్టులు దాకా వెళ్లడం అక్కడ ప్రభుత్వానికి చుక్కెదురు కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో బయటకు వచ్చిన లేఖ సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఈ వ్యవహారం మళ్లీ విజయసాయిరెడ్డి లేఖతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది.

నిమ్మగడ్డ పేరుతో హోంశాఖ కార్యదర్శికి లేఖ
గత నెలలో తాజా మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఒక లేఖ వెళ్లింది. అందులో నిమ్మగడ్డ తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరటంతో పాటుగా..స్థానిక ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ...ప్రభుత్వ తీరును తప్పు బడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే ఆ లేఖ తాను రాయలేదని వివరణ ఇచ్చినట్లుగా రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చినట్లు జాతీయ వార్తా సంస్థలు ప్రకటించాయి. దీని పైన వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ లేఖ నిమ్మగడ్డ రమేష్ పేరుతో టీడీపీ విడుదల చేసిందని..టీడీపీ మద్దతు మీడియా ప్రతినిధుల ద్వారా బయటకు వచ్చిందని ఫైర్ అయ్యారు. అంతేకాదు ఈ లేఖ ఎవరు రాశారు.. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై సీబీఐతో విచారణకు వైసీపీ డిమాండ్ చేసింది.

లేఖపై విచారణ కోరిన విజయసాయిరెడ్డి
గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ లేఖ వ్యవహారం ఒక్కసారిగా మళ్లీ తెరపైకి వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వెళ్లిన లేఖ పై విచారణ చేపట్టాలంటూ డీజీపీకి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా జారీ చేసిన నోటిఫికేషన్లో నిమ్మగడ్డ సంతకం ఒకలా ఉంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆయన పేరుతో అందిన లేఖలో సంతకం మరోలా ఉందని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు విజయ్ సాయిరెడ్డి. ఇక నిమ్మగడ్డ పేరుతో విడుదలైన లేఖ టీడీపీ ఆఫీసు నుంచే పుట్టిందని విజయసాయి రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. దాన్ని ఉద్దేశపూర్వకంగానే తయారు చేసినట్లు వెల్లడించారు.

లేఖ వెనక వర్లరామయ్య, కనకమేడల హస్తం ఉందన్న సాయిరెడ్డి
ఇక ఈ లేఖ సృష్టి వెనక ముగ్గురు టీడీపీ నేతల హస్తాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్లరామయ్య, టీడీ జనార్థన్‌లు కలిసి ఈ లేఖను తయారు చేశారని విజయసాయిరెడ్డి డీజీపీకి రాసిన లేఖలో ఆరోపించారు. అయితే ఈ వ్యవహారమంతా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని విజయసాయిరెడ్డి లేఖలో మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు. నిమ్మగడ్డ పేరుతో హోంశాఖ కార్యదర్శికి వెళ్లిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిజనిజాలు వెలికితీయాలని లేఖలో డీజీపీని కోరారు విజయసాయిరెడ్డి. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని కోరారు విజయసాయిరెడ్డి.