• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీ నేత‌ల అవినీతికి పోల‌వ‌రం! ఆరా తీయండి: ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు

|

హైదరాబాద్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా భావించే భారీ నీటి పారుద‌ల ప్రాజెక్టు పోల‌వ‌రం నిర్మాణం వ్య‌వ‌హారం.. వివాదం రాజ్‌భ‌వ‌న్ గడ‌ప తొక్కింది. ఒకవంక ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ సమీపిస్తుండగా..మరోవంక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పనిస్తున్నారు.

ఏపీ ద‌శ‌-దిశను మార్చివేసే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో అల‌వికాని అవినీతి చోటు చేసుకుంద‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్రరావు ఆరోపించారు. దీనిపై ఆయ‌న ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిశారు. అవినీతి వ్య‌వ‌హారంపై ఆరా తీయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌నకు విన‌తిప్ర‌తాన్ని అంద‌జేశారు. అందులో అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు.

తెలుగుదేశం పార్టీ త‌న దోపిడీకి పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకున్నార‌ని, ఇష్టానుసారంగా అంచ‌నా విలువ‌ల‌ను పెంచేశార‌ని విమ‌ర్శించారు. 16 వేల కోట్ల రూపాయ‌ల నిర్మాణ ప‌నుల అంచ‌నా విలువ‌ను ఎకాఎకిన 45 వేల కోట్ల‌కు ఒక‌సారి, 62 వేల కోట్ల‌కు మ‌రోసారి పెంచార‌ని అన్నారు. ఏ ప్రాతిప‌దిక మీద ఇంత భారీ ఎత్తున అంచ‌నాలు పెంచారనే విష‌యం ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేద‌ని చెప్పారు. తాము అనేక సార్లు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గానీ, జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు గానీ ఏనాడూ సూటిగా స‌మాధానం ఇవ్వ‌లేద‌ని చెప్పారు. అందుకే- తాము గ‌వ‌ర్న‌ర్‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని అన్నారు.

Congress Senior leader KVP Ramachandra Rao met Governor on Polavaram Project issue

అవినీతికి పాల్పడిన వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవడానికి సిఫార‌సు చేయాల‌ని కేవీపీ కోరారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయ‌డానికి కృషి చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మ‌రిన్ని వివ‌రాల‌ను కావాల‌ని కోర‌గా.. తాను వాట‌న్నింటినీ ఆయ‌న‌కు అంద‌జేశాన‌ని తెలిపారు. ఏపీ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ త‌రాలు బాగుండాలంటే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయాల్సి అవస‌రం ఉంద‌ని చెప్పారు. తాను గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రంలో ఎన్నో విషయాలను పొందుపరిచానని, వాటన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కేవీపీ తెలిపారు.

త‌న స్వార్థ రాజకీయాల ప్ర‌యోజ‌నాల కోసం పోల‌వ‌రం ప్రాజెక్టును అవినీతి మ‌యం చేశార‌ని, దీని ప్ర‌భావం రాష్ట్ర అభివృద్ధిపై తీవ్రంగా ప‌డుతుంద‌ని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటు చేసుకోవ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఎంత బాధ్య‌త ఉందో, అంతే బాధ్య‌త కేంద్రంపైనా ఉంద‌ని విమ‌ర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌ జాప్యంపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని తాను గ‌వ‌ర్న‌ర్‌ను కోరిన‌ట్లు వెల్ల‌డించారు.

Congress Senior leader KVP Ramachandra Rao met Governor on Polavaram Project issue

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గ‌వ‌ర్న‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశాన‌ని చెప్పారు. పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని గతంలో యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోనూ పొందు ప‌రిచింద‌ని గుర్తు చేశారు. క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను త‌న భుజాన వేసుకుంద‌ని, ఇష్టానుసారంగా అంచ‌నాల‌ను పెంచేసి, వంద‌ల కోట్ల రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డింద‌ని కేవీపీ విమ‌ర్శించారు.

English summary
Congress Party Senior leader and Rajya Sabha member KVP Ramachandra Rao is met Governor of Telugu States ESL Narasimhan at Raj Bhavan in Hyderabad on Thursday. He gave a representation to Governor and told that Huge Corruption accrued in the Polavaram Project in Andhra Pradesh. He urged to Governor that, Kindly look in to this matter, and take necessary action against Thousand Crores of Corruption in Polavaram Project construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X