• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌కు హ్యాండిచ్చిన కేంద్రం- హైకోర్టు తరలింపు ఆశలూ ఆవిరి- రాజధాని విచారణ తేలాకే క్లారిటీ

|

ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రక్రియ ఏ ముహుర్తాన మొదలుపెట్టారో కానీ అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ, ప్రభుత్వం, గవర్నర్‌ ఆమోదించిన రాజధాని తరలింపు వ్యవహారం హైకోర్టులో చిక్కుకుని విలవిల్లాడుతుండగా.. ఇప్పుడు కేంద్రం కూడా రాజదానులకు కొత్త కొర్రీలు పెడుతుండటం వైసీపీ సర్కారును చికాకు పెడుతోంది. తాజాగా హైకోర్టుపై కేంద్రం చేసిన ప్రకటనతో ఇప్పట్లో తరలింపు కూడా సాధ్యం కాదనే వాదన మొదలైంది. జడ్జీలతో జగన్‌ సర్కార్‌ సాగిస్తున్న వార్‌, రాజధాని వ్యవహారం తేలకపోవడం, ఇతరత్రా సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి.

 హైకోర్టు తరలింపుపై కేంద్రాన్నే నమ్ముకున్న జగన్‌

హైకోర్టు తరలింపుపై కేంద్రాన్నే నమ్ముకున్న జగన్‌

ఏపీ అసెంబ్లీ, గవర్నర్‌ ఆమోదించిన మూడు రాజధానుల చట్టాల ప్రకారం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపుతుందని సీఎం జగన్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. కేంద్రాన్ని పదే పదే రీ నోటిపికేషన్‌ ఇవ్వాలని అభ్యర్ధించారు. కేంద్రం తీసుకునే ప్రతీ నిర్ణయంలో కీలకంగా ఉండే హోంమంత్రి అమిత్‌షాను స్వయంగా పలుమార్లు కలిసి హైకోర్టు తరలింపు చేపట్టాలని కోరారు. అయినా జగన్‌కు అవునని, కాదని చెప్పకుండా ఇన్నాళ్లూ నాన్చిన కేంద్రం.. తాజాగా పార్లమెంటులో దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.

దీంతో అమిత్‌షాకు జగన్ చేసిన అభ్యర్ధనలన్నీ బుట్టదాఖలైనట్లేనన్న వాదన వినిపిస్తోంది.

 ఏకాభిప్రాయం తప్పనిసరన్న కేంద్రం

ఏకాభిప్రాయం తప్పనిసరన్న కేంద్రం

ఏపీ హైకోర్టును గతంలో హైదరాబాద్‌ హైకోర్టు నుంచి విడగొట్టి అమరావతిలో ఏర్పాటు చేసే విషయంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవు. దీంతో ఆ ప్రక్రియ చంద్రబాబు ప్రభుత్వం కోరుకున్న వెంటనే జరిగిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు రాజధానుల తరలింపు న్యాయ, చట్టబద్ధమేనా అన్న విషయాన్ని కోర్టులు ఇంకా తేల్చలేదు. వందల కొద్దీ దాఖలైన పిటిషన్లపై ఛీఫ్‌ జస్టిస్ మార్పు అనంతరం హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభం కానే లేదు. అదే సమయంలో హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయం ఉంటేనే హైకోర్టు తరలింపు సాధ్యమని, ఇందుకు నిర్ణిష్ట గడువేదీ పెట్టుకోలేదని కేంద్రం తేల్చిచెప్పేసింది. దీంతో హైకోర్టు తరలింపు ఇప్పట్లో జరిగేనా అన్న వాదన మొదలైంది.

 తిరిగి జడ్జీల చేతుల్లోనే నిర్ణయం

తిరిగి జడ్జీల చేతుల్లోనే నిర్ణయం

ఏఫీ హైకోర్టుపై కేంద్రం చేసిన ప్రకటనతో ఏకాభిప్రాయ సాధన కోసం జగన్‌ సర్కార్‌, హైకోర్టు ఇరువురూ ప్రయత్నించాల్సి ఉంది. ఇందులో జగన్‌ సర్కార్‌ కోరుకున్నట్లుగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు న్యాయమూర్తులు ఒప్పుకోవాలి. ఇప్పటికే అమరావతిలో గత సర్కారు నుంచి స్ధలాల కేటాయింపు కూడా పొందిన న్యాయమూర్తులు ఇప్పుడు కర్నూలుకు తరలివచ్చేందుకు అంగీకరించాలంటే జగన్ సర్కార్‌ అంతకుమించిన ప్రత్యామ్నాయం చూపించాలి. ఇదంతా జరగాలంటే తిరిగి హైకోర్టు మూడు రాజధానుల ఏర్పాటు చట్ట సమ్మతమే అని ఓసారి తీర్పు ఇవ్వాలి. దాన్ని తిరిగి సుప్రీంకోర్టు కూడా ఆమోదించాలి. అంటే సర్కారు ఒప్పుకున్నా జడ్జీలు ఒప్పుకుంటే తప్ప ఏకాభిప్రాయం సాధ్యం కాదు.

 జగన్‌ వర్సెస్‌ జడ్జీల వార్‌తో కష్టమేనా ?

జగన్‌ వర్సెస్‌ జడ్జీల వార్‌తో కష్టమేనా ?

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ గతంలో సుప్రీం ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు సీఎం జగన్‌ లేఖ రాశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంతో జడ్జీలు, జగన్‌ సర్కార్‌ మధ్య అగాధం కూడా బాగా పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే జగన్‌ సర్కార్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా కూడా న్యాయవ్యవస్ధలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఏ తీర్పులు వస్తున్నాయని జగన్ ఆరోపించారో ఇప్పటికీ పలు కేసుల్లో ప్రతికూల తీర్పులే వస్తున్నాయి. జడ్డీలకు దురుద్దేశాలు ఆపాదించలేం కానీ ప్రభుత్వానికి మాత్రం ఇవన్నీ ఎదురుదెబ్బలుగా నిలిచిపోతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో జగన్‌ సర్కారు హైకోర్టుతో ఏకాభిప్రాయం సాధించడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది.

 రాజధాని విచారణ తేలాకే హైకోర్టుపై క్లారిటీ

రాజధాని విచారణ తేలాకే హైకోర్టుపై క్లారిటీ

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా దాదాపు 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధానికి భూములిచ్చిన రైతులే కాదు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పార్టీలు, ఇలా ఎంతో మంది ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఏపీలో విపక్షాలన్నీ ముక్తకంఠంతో రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో రాజధాని తరలింపుపై వెలువడే తీర్పు ఎంతో కీలకంగా కానుంది. కానీ ఛీఫ్‌ జస్టిస్‌ మారినా రాజధాని పిటిషన్లపై విచారణ ఎందుకో ఆలస్యమవుతోంది. దీంతో ఈ ఏడాది రాజధాని తరలింపు కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది. ఓసారి రాజధాని తరలింపు చట్టబద్ధత తేలితే కానీ హైకోర్టు తరలింపు విషయంలో హైకోర్టు కూడా ప్రభుత్వంతో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించే అవకాశాలూ కూడా లేనట్లే.

English summary
shifting of andhra pradesh high court from amaravati to kurnool will be the tough task for jagan government amid jagan versus judges war and court cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X