కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రానున్నది కష్ట కాలం అంటున్న జయప్రకాశ్ నారాయణ
కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం వెరసి భవిష్యత్ చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పాక్షిక సమస్యగా చూస్తోందని కానీ ఇది చాలా తీవ్ర సమస్య అని ,దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. ఇక తాజా పరిస్థితుల ప్రభావం భవిష్యత్ మీద దారుణంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు . కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతాయని ఇక వాటిని ఎదుర్కోటానికి సన్నద్ధంగా ఉండాలని జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు
మోడీ రచించిన సప్తపది: ఈ ఏడు సూత్రాలతో కరోనా పరార్: తప్పకుండా అనుసరించాలని పిలుపు

లాక్ డౌన్ తో సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు లాక్ డౌన్ ను మే 03వ తేదీ వరకు పొడిగించారు ప్రధాని నరేంద్ర మోడీ . అయితే ఈ లాక్ డౌన్ వల్ల లాభమా , నష్టమా అంటే నష్టమే ఎక్కువ ఉంటుందని , భవిష్యత్ భయంకరంగా ఉండకుండా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు . లాక్డౌన్లో మొదటి మూడు వారాల కంటే కూడా తర్వాతి మూడు వారాల్లో సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు రంగాలు దెబ్బతిన్నాయని, రాష్ట్రాలకు ఆదాయం ఆగిపోయిందని, ఇప్పటికే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ,ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతే భవిష్యత్ కష్టం
ఇక కరోనా కంట్రోల్ లో విదేశాలతో పోలిస్తే మనం చేస్తున్న ఖర్చు చాలా తక్కువ అని పేర్కొన్నారు జేపీ . ఇక కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు సంపన్నదేశాలు రూ. 6 కోట్ల కోట్లు కేటాయిస్తే..మోడీ ప్రభుత్వం ఎంత ఇచ్చిందని సూటిగా ప్రశ్నించారు. ఇక వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ విధించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు . ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోతున్న సమయంలో నష్ట నివారణా చర్యలు ఏం తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని సూచన
సంపన్నదేశాల్లోనే ఆదాయం లేక చేత్తులు ఎత్తేస్తుంటే మరి భారతదేశ పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు జేపీ . ఇక సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల జీవనం దుర్భరంగా మారుతుందని , వారి కోసం ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు విరాళాలు ఇస్తున్న వారికి పన్ను రాయితీ ఇస్తే ఎక్కువ మంది ముందుకు వస్తారన్నారు. అలా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాయితీలు ఇచ్చి ప్రొత్సాహాకాలివ్వాలని, ఇందుకు చట్టాలు సవరించాలని జేపీ వ్యాఖ్యానించారు.

నిరుపేదలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న జేపీ
ఇది చెయ్యండి అది చెయ్యండి అంటూ ఆదేశాలు, ఉపదేశాలు ఇస్తున్నారు కానీ కనీసం నిరుపేదలకు కావాల్సిన మౌలిక అవసరాలను తీర్చి పేదలను ఆదుకొనే ప్రయత్నం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక సహాయం చేస్తున్న వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇస్తే వంద శాతం మినహాయింపు ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు . పరిశ్రమల విషయంలో కూడా రాయితీలు ప్రకటించి పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని జేపీ పేర్కొన్నారు.