ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 4,108 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,108 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 30,182 చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 21,07,493 పాజిటివ్ కేసులకు గాను 20,62,801 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

కరోనా విలయతాడవం
ఏపీలో కరోనా మహమ్మారికి విలయతాడవం చేస్తోంది. కేసుల సంఖ్య గత వారం రోజులుగా నాలుగువేలకు పైగా పెరుగుతూనే ఉన్నాయి . గడిచిన 24 గంటల్లో మొత్తం 22,882 శాంపిల్స్ పరీక్షించగా 4,108 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. నిన్న ( ఆదివారం ) 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య కాస్త తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,510 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చిత్తూరు, విశాఖ జిల్లాల్లో డెంజర్ బెల్
రాష్ట్రంలో చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. విశాఖలో అత్యధికంగా 1,018 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తర్వాత చిత్తూరు 1,004, గుంటూరు 345, కడప 295, నెల్లూరు 261, తూర్పుగోదావరి 263, ప్రకాశం 176, కృష్ణా 170 కేసులు నమోదయ్యాయి. విజయనగరం 169, అనంతపురం 162, శ్రీకాకుళం 114, కర్నూలు 85, పశ్చిమగోదావరి జిల్లాలో 46 మందికి కరోనా సోకింది. పలు జిల్లాల్లో క్రమేనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.

కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్ష
ఏపీలో కరోనా కట్టడిపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేసులు పెరుగుదల, తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని కూడా పెంచామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 53, 183 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆక్సిజన్ కొరత కూడాలేదని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కరోనా కేర్ సెంటర్ ను గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.