ఏపీలో కరోనా ప్రళయం .. ఒక్కరోజులోనే 13,212 కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,212 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోలిస్తే ఈ సంఖ్య వెయ్యికి పెరిగింది. కరోనాతో పోరాడుతూ ఒక్కరోజులోనే ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ, చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారు.
కరోనా విలయం.. 64,136 యాక్టివ్ కేసులు..
రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 64,136 ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 44,516 శాంపిల్స్ పరీక్షించగా .. 13,212 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా నుంచి 2,942 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 21,50,373 కాగా.. 20,71,705 మంది డిశ్చార్జ్ అయ్యాయి. మొత్తం మరణించిన వారి సంఖ్య 14, 532కు చేరింది.
విశాఖ, చిత్తూరు జిల్లాల్లో డెంజర్ బెల్
ఏపీలోని విశాఖపట్నం , చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విశాఖలో 2,244 , చిత్తూరు 1,585, అనంతపురం 1,235, శ్రీకాకుళం 1,230, గుంటూరు 1,054 , నెల్లూరు 1,051మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అటు కర్నూలు 961, తూర్పుగోదావరి 816, ప్రకాశం 772, విజయనగరం 681, కడప 649, పశ్చిమ గోదావరి 596 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా కృష్ణా 338 మంది కరోనా సోకింది. మహమ్మారి బారిన పడి విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.కరోనా బాదితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆందోళనలో తల్లిదండ్రులు
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే కరోనా తీవ్రత ఎక్కువ ఉండడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు స్కూళ్లలో ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో తమ పిల్లలను స్కూల్‌కు పంపించాలంటే భయమేస్తుందని వాపోతున్నారు. పిల్లల ద్వారా ఇంట్లో ఉన్న వృద్ధులకు కరోనా సోకితే తాము ఇబ్బందులకు గురి అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్కూల్స్ మూసివేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.