కరోనా వచ్చిందహో.. జాగ్రత్తగా ఉండండహో .. తెలుగు రాష్ట్రాల్లో డప్పు చాటింపు
చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13 నమోదు కాగా మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏపీలోనూ రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనాను నియంత్రించటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి కరోనా నివారణకు కష్టపడుతున్నాయి. ఒకపక్క ఐసోలేషన్ వార్డులు , ఐసీయూ బెడ్లు సిద్ధం చేస్తూనే మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో గ్రామగ్రామాన డప్పు చాటింపు చేస్తున్నారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు.
ఇటు ప్రభుత్వాలు, అటు వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సెలబ్రెటీలు కూడా బయటకు వచ్చి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.
కరోనా నుండి కాపాడుకోవటానికి తగిన చర్యలను చెప్తూనే సెల్ఫ్ ఐసోలేషన్ పాటించాలని సూచిస్తున్నారు. ఇక మన రాష్ట్రాలలో కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామాల్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కరోనా వైరస్ వచ్చేసిందహో.. జాగ్రత్తలు తీసుకోండహో .. అంటూ నలుగురు కలిసి తిరగొద్దని , చేతులు పట్టుకుని మాట్లాడవద్దని , పండుగలు పబ్బాలకు ఎవరి ఇళ్ళకు వెళ్ళకండి అని చాటింపు చేస్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కుని , ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. , జలుబు , జ్వరం, దగ్గు వచ్చిన వాళ్ళు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని ' డప్పు చాటింపు వేయిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుండి కాపాడుకోవచ్చని డబ్బు కొట్టి మరీ చాటింపు వేస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.