ఎసిబి అప్ డేట్: వాళ్లు చిరుద్యోగులు కాదు సిరుద్యోగులు, ఒక్క విఆర్వో ఆస్తే 100 కోట్లు పైనే
విశాఖపట్నం: విశాఖలో ఎసిబి దాడిలో పట్టుబడిన నాలుగో తరగతి ఉద్యోగుల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పేరుకు చిన్న ఉద్యోగులైనా సంపాదనలో పెద్ద ఉద్యోగులు సైతం కలలో కూడా ఊహించనంత ఆస్తులు కూడబెట్టడంతో చర్చనీయాంశం అయ్యారు.
హోదా ప్రకారం చూస్తే వీళ్లంతా చిరుద్యోగులు. జీతం కూడా బాగా తక్కువే. లెక్కప్రకారం ఈ జీతంతో కుటుంబ పోషణే భారంగా ఉండే పరిస్థితి. కానీ ఎసిబి తాజాగా పట్టుకున్న వీరి సంపాదన, ఆస్తులు చూస్తే రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఉద్యోగులైన గ్రూప్ 1 ఆఫీసర్లు సైతం దిగ్భ్రాంతి చేందేటంత ఆస్తులు కూడబెట్టారు.
అయితే ఇదంతా అక్రమ సంపాదనే అని వేరుగా చెప్పనక్లర్లేదు! వీరిలో ఒక్క విఆర్వో అక్రమాస్తుల విలువ 100 కోట్ల పై మాటేనని ఎసిబి లెక్కల్లో తేలిదంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

వీళ్లు చిరుద్యోగులా?...కాదు సిరుద్యోగులు...
శనివారం విశాఖ రేంజ్ పరిధిలో ఎసిబి దాడిలో పట్టుబడిన ముగ్గురు ఉద్యోగుల్లో కాండ్రేగుల సంజీవ్‌కుమార్, వెంకటేశ్వరరావు అనే ఇద్దరూ రెవెన్యూ శాఖలో వీఆర్వోలుగా పనిచేస్తుండగా, మునికోటి నాగేశ్వరరావు జీవీఎంసీలో మజ్దూర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయా శాఖల్లో చిరుద్యోగులైన వీరు అక్రమార్జనలో ఆరితేరి సిరుద్యోగులుగా అవతరించిన వైనం రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక వీరి ఒక్కొక్కరి అవినీతి చరిత్ర ఇలా ఉంది.

నిఖార్సైన అక్రమార్కుడు...ఈ విఆర్వో ఆస్తి...రూ.100 కోట్ల పైనే...
మార్కెట్లో రూ.40 కోట్లు ఉంటాయని అంచనా వేసిన విశాఖపట్నం అర్బన్ మండలం మల్కాపురం క్లస్టర్ వీఆర్వో సంజీవ్‌కుమార్ అక్రమార్జన రూ.100 కోట్లు పైమాటేనని తెలిసి ఎసిబి అధికారులే అవాక్కయ్యారు. శనివారం జరిపిన సోదాల్లో సుమారు రూప 10 కోట్ల అక్రమార్జన గురించి తెలియగా...ఆ తరువాత విచారణలో ఇతనికి కీలక ప్రాంతాల్లో ఉన్న ఈ ఆస్తుల ధరలను బట్టి చూస్తే వాటి విలువ రూ. 100 కోట్లు పైనే ఉంటుందని ఎసిబి అధికారులే అంటున్నారు. ఇతను తన అక్రమాలకు అడ్డాగా మద్దిలపాలెం సమీపంలోని శ్రీసాయి ఆదిత్య నిలయంలో 303 నంబరు ఫ్లాటులో ఏకంగా ఒక ప్రైవేట్ కార్యాలయమే నిర్వహిస్తూ అక్కడ, ఒక్కొక్కరికి రూ.25 వేల జీతాలిచ్చి ప్రైవేటు సిబ్బందిని పెట్టుకున్నాడంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. విజయనగరం జిల్లా గణుగుబూడిలో సంజీవ్‌కుమార్ ఏకంగా 200 ఎకరాల కొనుగోలుకు అడ్వాన్సు ఇవ్వడంతోపాటు సంజీవ వనం పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు తేలింది.అంతేకాదు బొగ్గు వెంకటసుబ్రహ్మణ్య మల్లిఖార్జునరావు అనే ఇంజినీరును బినామీగా పెట్టి రియల్ ఎస్టేట్ లో రూ.50 కోట్ల లావాదేవీలు జరిపినట్లు అంచనా.

ఈ అక్రమార్కుడి దగ్గర...డమ్మీ పిస్టల్...కత్తి...ఎందుకో?...
ఎసిబి సోదాల్లో అనకాపల్లిలోని ఎన్జీవో కాలనీలో సంజీవ్‌కుమార్‌కు చెందిన నివాసంలో డమ్మీ తుపాకీతోపాటు మరో బటన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఇతని వద్ద ఎందుకు ఉన్నాయి...భూముల క్రయవిక్రయాలు, సెటిల్మెంట్ల సమయంలో అవతలి పార్టీని బెదిరించడానికి వీటిని ఉంచుకున్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ తుపాకీ బటన్ ప్రెస్ చేస్తే నిప్పురవ్వలు వస్తున్నాయి. విజయనగరం జిల్లా గణుగుబూడిలో సంజీవ్‌కుమార్ ఏకంగా 200 ఎకరాల కొనుగోలుకు అడ్వాన్సు ఇవ్వడంతోపాటు సంజీవ వనం పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు తేలింది. చాలా భూములకు ఇదేలా అడ్వాన్సులు ఇచ్చినట్లు, మరికొన్ని కొనుగోలు చేసి అభివృద్ధి చేసి వేరొకరికి అమ్మినట్లు వెల్లడైంది. సంతకాలతో కూడిన రూ.లక్షల విలువైన ఖాళీ చెక్కులనూ గుర్తించారు. వీఆర్వో సంజీవ్‌కుమార్, అతని కుటుంబీకులకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. మూడింటిలో నిల్వలపై సోమవారం స్పష్టత రానుంది.

పొలిశెట్టి వెంకటేశ్వరరావు వీఆర్వోగా 2008లో రెవెన్యూ శాఖలో
పొలిశెట్టి వెంకటేశ్వరరావు వీఆర్వోగా 2008లో రెవెన్యూ శాఖలో చేరాడు. ప్రస్తుతం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని మద్దిలపాలెం క్లస్టర్లో పనిచేస్తున్నాడు. గాజువాకలోని వెంకటేశ్వరరావు ఇల్లు, సీతమ్మధార, గోపాలపట్నం, ఎస్.రాయవరం మండలం దర్లపూడి, నర్సీపట్నం మండలం పెడబొడ్డేపల్లిలోని బంధువులు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లభ్యమైన ఆస్తుల విలువ డాక్యుమెంట్ ప్రకారం రూ.1.11 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.15 కోట్లు వుండవచ్చునని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా డానీ వీరి జీతభత్యాలకు, ఆస్తులకు ఏమాత్రం పొంతన లేకపోవడం గమనార్హం.

మూడో అక్రమార్కుడు...జీవీఎంసీ మజ్దూర్...
ఇక ఎసిబి దాడిలో పట్టుబడిన మూడో వ్యక్తి జీవీఎంసీ మజ్దూర్ మునికోటి నాగేశ్వరరావు. ఇతని నివాసంతోపాటు విశాఖ రేంజ్లో మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా అక్రమాస్తుల విలువ రూ.10 కోట్లకు పైనే నని తెలిసింది. ఈ నాగేశ్వరరావు 1997లో జీవీఎంసీలో చేరాడు. చాలాకాలం డిప్యుటేషన్‌పై టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేశాడు. ప్రస్తుతం ఎలక్రిక్టల్ విభాగంలో మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు యాసిడ్ శివ అనే క్రిమినల్‌తో కలిసి దందాలు సాగించినట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇతడిపై దృష్టి సారించిన ఎసిబి...నాగేశ్వరరావు ఇంటితోపాటు శివ నివాసం లోనూ అధికారులు సోదాలు నిర్వహించింది. మజ్దూర్ ఇంట గుర్తించిన ఆస్తుల ముఖ విలువ రూ.1.31 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.10 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి, ఆస్తులకు పొంతన లేకుండా వీరు ఈ స్థాయిలో అక్రమార్జన చేస్తున్నా సుదీర్ఘకాలం వీరి అక్రమ వ్యవహారాలను కనిపెట్టలేకపోవడం వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేస్తోంది. అంతేకాదు...ఇలాంటి వాళ్లు ఇంకెందరో అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!