వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంలో అవినీతా?: జనసేనానిపై కేఈ, దేవినేని, అచ్చెన్నాయుడు, నారాయణ ఫైర్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, నారాయణ పవన్ వ్యవహార శైలిని దుయ్యబట్టారు.

తెలుగుదేశం పార్టీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ప్రతిష్టే మంటగలిసిందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించగా, పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతికి ఆస్కారమే లేదంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొట్టిపారేశారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్, పవన్ ఇద్దరూ ప్రధాని మోడీకి కోవర్టులు అని వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలతో పోయింది ఆయన పరువే...

పవన్ వ్యాఖ్యలతో పోయింది ఆయన పరువే...

పోలవరంలో జరిగిన అవినీతేంటో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం కాదని, ఆధారాల సహా రుజువు చేయాలని ఆయన సవాలు చేశారు. అవినీతిపై చర్యలు తీసుకునే ధైర్యమున్న ప్రభుత్వం తమదన్నారు. తెలుగుదేశం పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో పవన్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల పోయేది ఆయన పరువేనంటూ కేఈ ఎద్దేవా చేశారు.

ఇక్కడెందుకు రచ్చ?

ఇక్కడెందుకు రచ్చ?

రాష్ట్రానికి ఏమైనా చేయదలుచుకుంటే ఢిల్లీకి వెళ్లి చేయాలని పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సూచించారు. అంతేకాదు, ఏపీకి ప్రత్యేక హోదా పైనా పవన్ మాట మారుస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడతానన్నారని, దీనిపై ఢిల్లీలో చర్చ జరుగుతుంటే.. ఇక్కడ రచ్చ చేయడానికి పవన్ ఆలోచన చేస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు.

మూడు నెలలకోసారి వచ్చి...

మూడు నెలలకోసారి వచ్చి...

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం మాట తప్పిందని, నిధులు ఇవ్వడం లేదు కాబట్టే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరించే అవకాశం లేకపోలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అధికారంలో లేని వాళ్ల సలహాలు తీసుకుంటే పవన్ కళ్యాణే నష్టపోతారన్నారు. మూడు నెలలకోసారి వచ్చి బురద జల్లుడు కార్యక్రమాలు చేయడం సరికాదని హితవు పలికారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో చెల్లవన్నారు.

అవకతవకలా? ఆస్కారమే లేదు: మంత్రి దేవినేని

అవకతవకలా? ఆస్కారమే లేదు: మంత్రి దేవినేని

నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు ఆస్కారమే లేదని, రెండ్రోజుల కిందట ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది అక్టోబర్ లో తాము పోలవరం పనులు పరిశీలించామని, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఎంతో ప్రగతి ఉందని నిపుణుల కమిటీ రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో చెప్పిందన్నారు. 3డి నమూనా కూడా సిద్ధమైందని, త్వరలో మిగిలిన డిజైన్లకు సంబంధించి అనుమతులు మంజూరు చేస్తామని కమిటీ తెలిపినట్టు చెప్పారు.

16 సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్క పోలవరమే...

16 సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్క పోలవరమే...

భూ సేకరణకు సంబంధించి నాబార్డు నుంచి నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో నష్టపరిహారం జమవుతోందని, డయాఫ్రమ్ వాల్ పనులు మే నెలాఖరుకు పూర్తి చేస్తామని మంత్రి దేవినేని తెలిపారు. దేశంలో 16 జాతీయ సాగునీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, వాటిలో ‘పోలవరం' పనులే శరవేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత తమ ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్లలో రూ.8 వేల కోట్లకు పైబడి ఖర్చు చేశామని, దాంట్లో కేంద్రం నుంచి రూ.2,727 కోట్లు ఇంకా రావాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టు చెప్పారు.

గడువులోగా పూర్తికి కృషి...

గడువులోగా పూర్తికి కృషి...

వచ్చే జూన్ మొదటి వారానికి గోదావరి వరద ప్రవాహం పెరుగుతుందని, ఈలోగా కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం వేచిచూడకుండా, ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగడానికి రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులు వెచ్చిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆశీస్సులతో ప్రాజెక్టు పనులను లక్ష్యంలోగా పూర్తి చేస్తామని, నీరు - ప్రగతి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని దేవినేని తెలిపారు. ప్రతి వారంలాగే సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 54వ వర్చువల్ సమావేశం సమావేశంలో దేవినేనితో పాటు కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. నేటి వరకూ జరిగిన పనుల వివరాలను దేవినేని ఈ సందర్భంగా వివరించారు.

జగన్, పవన్.. మోడీకి కోవర్టులు: మంత్రి అచ్చెన్నాయుడు

జగన్, పవన్.. మోడీకి కోవర్టులు: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రధాని మోడీకి జగన్, పవన్ లు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా హామీని మోడీ ఇవ్వలేదని పవన్ అనడం విడ్డూరంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదివారని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకూడదనే అభిప్రాయం పవన్ మాటల్లో కనిపిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను నియమించారని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవన్ మార్కులేస్తున్నారని, అసలు, పవన్ మార్కులెవరికి కావాలంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్‌తో కేంద్రం నాటకం: మంత్రి నారాయణ

పవన్‌తో కేంద్రం నాటకం: మంత్రి నారాయణ

మంత్రి నారాయణ కూడా సోమవారం మాట్లాడుతూ జనసేనానిపై విమర్శలు కురిపించారు. పవన్ కల్యాణ్ రోజుకో ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆయనతో నాటకమాడిస్తోందని నారాయణ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి వెళ్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హామీలిచ్చి హ్యాండిచ్చిన కేంద్రాన్ని విమర్శించడం మానేసి టీడీపీని పవన్ టార్గెట్ చేయడంలో అర్థం లేదన్నారు మంత్రి నారాయణ.

English summary
TDP Leaders Fired on Janasena Chief Pawan Kalyan on his comments about corruption in Polavaram Project here in Amaravati on Monday. Deputy CM KE Krishna Murthy critisized Pawan Kalyan that if he has any evidences about corruption in Polavaram he can show us. Minister Devineni Umamaheswar Rao while speaking said.. Pawan Kalyan can't catch corruption in Polavaram as there is no corruption had taken place. Minister Atchannaidu also fired on Pawan kalyan. While speaking he said Jagan and Pawan are acting Coverts to Prime Minister Modi. Minister Narayana also critisized Pawan's way of talking. He said Pawan Kalyan told that he will go to Delhi to fight for Special Status to AP, then why he is not doing that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X