బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు-ఆ దర్శనాలు పూర్తిగా నిలిపివేత, సేవలపైనా ప్రభావం
ఏపీలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా పడింది. కోవిడ్ ప్రభావంతో ఇంద్రకీలాద్రిపై కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గుళ్లో పనిచేసే పూజారులు, సిబ్బందికి కరోనా సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆలయంలో పలు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు.
విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ఇవాళ ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు విధించినట్లు ఆమె వెల్లడించారు. ఆలయంలో దుర్గమ్మ అంతరాలయ దర్శనం, శఠారి పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు. అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేసినట్లు ఈవో తెలిపారు.

దుర్గమ్మ దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం ఇస్తున్నామని.. మాస్కు లేని భక్తులకు అనుమతించడం లేదని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. కొవిడ్ ఉద్ధృతి నేపధ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భక్తులు సహకరించాలని కోరారు. ఇప్పటికే ఆలయంలో పలువురికి కరోనా సోకినట్లు తేలడంతో వారిని ఐసోలేషన్ కు పంపి చికిత్స అందిస్తున్నారు.
వారి నుంచి ఇంకెవరికైనా సోకిందేమోనని పరీక్షలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో యథావిధిగా సేవలు కొనసాగించడం శ్రేయస్కరం కాదనే నిర్ణయానికి అధికారులు వచ్చేశారు. అందుకే దర్శనాలతో పాటు సేవలపైనా ఆంక్షలు విధిస్తున్నారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.