బీజేపీ పెళ్లికి జనసేన మేళం - కేంద్రం చర్యలకు బాకా ఊదమంటారా ? పవన్ పై సీపీఐ ఫైర్
గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో కమ్యూనిస్టులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వదిలేసినా వారు మాత్రం తమకు చేసిన ద్రోహాన్ని ఇప్పట్లో మర్చిపోయేలా కనిపించడం లేదు. సమయం దొరికినప్పుడల్లా పవన్ నిర్ణయాలపై నిప్పులు చెరుగుతున్న కమ్యూనిస్టులు తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు ఇచ్చిన ఓ పిలుపును టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు.
మోదీ ఏడాది పాలన.!చరిత్రగా మారిందా.!కాలగర్బంలో కలిసిపోయిందా.!స్పందించిన పవన్ కళ్యాణ్.!
లాక్ డౌన్ కారణంగా జనం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్బర్ అభియాన్ ప్యాకేజీ వల్ల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాజాగా జనసేన అధినేత పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీతో పొత్తు కొనసాగుతున్న మిత్రపక్షం చేపట్టిన భారీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సానుకూల స్పందన వస్తుందని పవన్ భావించారు.

అయితే ఇదే అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పవన్ పాత మిత్రుడు, సీపీఐ నేత రామకృష్ణ విమర్శలకు దిగారు. కేంద్రం ఏపీకి ఏం చేసిందని పొగడాలని పవన్ ను రామకృష్ణ ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేసిందా, ప్రత్యక హోదా ఇచ్చిందా, అమరావతికి సాయం చేసిందా అని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని సైతం కేంద్రం వెనక్కి లాక్కుందని పవన్ కు గుర్తు చేశారు. కేంద్రం ప్యాకేజీ మధ్యతరగతికి ఊతమిచ్చేలా ఉందంటున్న పవన్ కు చంటిబిడ్డల్ని ఎత్తుకుని అలమటిస్తున్న వలస కార్మికుల కష్టాలు కనిపించలేదా అని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్రం చర్యలకు బాకా ఊదుతూ జనసేన శ్రేణులు ప్రచారం చేయాలని పవన్ సూచించడం బీజేపీ పెళ్లికి జనసేన మేళంలా ఉందని రామకృష్ణ ఎద్దేవా చేశారు.