కేసీఆర్ ఎదురుతిరిగారు-జగన్ మాత్రం- గుజరాత్ అల్లర్లపై అందరికీ తెలుసన్న సీపీఐ నారాయణ
నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇవాళ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తో పాటు ప్రధాని మోడీ, ఎన్డీయే సర్కార్ పై నారాయణ నిశిత విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రధాని మోడీ భీమవరం టూర్ ను ఇందులో ప్రస్తావించారు.
ప్రధాని మోడీపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై హనుమాన్ చౌదరి అనే వ్యక్తి క్రిమినల్ ప్రోసీడింగ్స్ చేపడతానన్నారని, దాన్ని తాను స్వాగతిస్తున్నట్లు సీపీఐ నారాయణ తెలిపారు. మోడీపై తాను చేసిన వ్యాఖ్యలు బహిరంగమేనన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జయంతి రోజు ప్రధాని గిరిజనులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారని, నేటికి గిరిజనులపై కార్పొరేట్ సంస్థలు అడవుల్ని ఆక్రమించుకోవాలని దాడులు చేస్తున్నారని నారాయణ గుర్తుచేశారు. సుమారు 3 లక్షల మంది గిరిజనులు రాష్ట్రంలో అడవుల్ని ఆధారం చేసుకుని జీవుస్తున్నారని, సహజ వనరుల కోసం అడవుల్ని కార్పొరేట్ సంస్థలు నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
మరోవైపు గుజరాత్ అల్లర్ల గురించి ప్రపంచానికి తెలుసని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.సుప్రీం కోర్ట్ ఆ కేస్ కొట్టివేస్తూ న్యాయమూర్తి పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆధారం చేసుకుని అమిత్ షా పీటీషనర్ ని అరెస్ట్ చేయమని చెప్పడం దారుణమన్నారు. పీటీషనర్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం పౌర హక్కులను కాలరాయడమేనన్నారు. అక్కడ అలా చేస్తూ ఇక్కడికి వచ్చి గిరిజనులపై ప్రేమ ఒలకబోయడం ఖచ్చితంగా రాజకీయ లబ్ది కోసమేనన్నారు.

దేశం ఉన్నది ఫెడరల్ వ్యవస్థలోనే అని రాష్ట్రాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకు ఉన్నాయని సీపీఐ నారాయణ తెలిపారు. మహారాష్ట్ర సహా 9 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతీస్తూ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని నారాయణ విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థ ను మోడీ దెబ్బ తీస్తున్నారని, ఇప్పుడు భాజపా కన్ను ఢిల్లీ, తెలంగాణపై పడిందన్నారు. భాజపా ,వైకాపా బంధం చాలా అన్యోన్యంగా ,తల వంచి మెడ వంచి జపం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. హోదా ,పోలవరం,నిధులు ఏమయ్యాయి,ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు. మోడీ భయపడి,గజగజ వణికి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారని జగన్ ను నారాయణ విమర్శించారు. రక్తసిక్త హస్తాలతో రాష్ట్రాలను నాశనం చేస్తూ మోడీ ,అమిత్ షా, రాష్ట్రానికి వస్తే వారిని చూసి వణికిపోతున్నారని ఆరోపించారు.
నేటి వరకు మోడీ 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని,ఇంకో 100 అమ్మకానికి సిద్ధమయ్యారని నారాయణ ఆరోపించారు. గుజరాత్ వాళ్ళకే అన్ని అమ్ముతున్నారని, డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు గుజరాత్ వాళ్లేనని నారాయణ తెలిపారు. కేసీఆర్ ఎదురు తిరిగినా ,జగన్ మాత్రం ఏమి మాట్లాడరన్నారు. తీర ప్రాంతం అంతా గుజరాత్ వాళ్ళకే రాసిస్తున్నారన్నారు. బొగ్గు కొనుగోలు పై కేసీఆర్ ఎదురు తిరిగారు,ఆదాని దగ్గర కొనను అని చెప్పారు .భాజపా వ్యతిరేక శక్తులన్ని కలిసి పోరాడాలిన్నారు. జులై 13 నుంచి 17 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని నారాయణ తెలిపారు.