'రోజా చేసిన తప్పేంటి?, బాబుకు ఆమె కాళికాదేవిలా కనిపిస్తున్నారు!'
గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరోసారి సస్పెన్షన్ వేటు ఖాయమన్న వాదనలు వినిపిస్తుండటంతో పలువురు రాజకీయ నాయకులు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు దీనిపై గగ్గోలు పెడుతుండగా.. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
ఎమ్మెల్యే రోజా ఎలాంటివారైనా.. ఆమె ఒక మహిళ అని, ఆమె కన్నీరు పెట్టుకోవడం రాష్ట్రానికి మంచిది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. మరో ఏడాది పాటు రోజాను అసెంబ్లీ నుంచి నిషేధించాలనుకోవడం సరికాదని హితవు పలికారు. గుంటూరులో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'సస్పెన్షన్' ప్రభుత్వ కుట్రే, రోజాపై బాబుకు ఎందుకింత కక్ష?: వైవీ సుబ్బారెడ్డి

రోజాపై సస్పెన్షన్ ను తప్పుపడుతూ.. అయినా రోజా చేసిన తప్పేంటని? నారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు, టీడీపీకి రోజా కాళికాదేవిలా కనబడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆమెపై సస్పెన్షన్ ఆలోచనను విరమించుకుని ఇప్పటికైనా సభలోనికి అనుమతించేలా తీర్మానం చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను, అటు కేంద్రంలోను ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం లేకుండా పాలన కొనసాగుతుందని నారాయణ మండిపడ్డారు. ఇలాంటి నియంతృత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, గంగలో కలిసిపోయే రోజు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీయేతర పార్టీలన్ని ఏకమైతేనే ప్రధాని మోడీని ఓడించడం సాధ్యపడుతుందని నారాయణ చెప్పుకొచ్చారు.