వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడి పందేలు అదుర్స్, చేతులు మారిన కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పందేల జోరు చెప్పనలవి కాకుండా ఉంది. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పెందేల జోరు జూదరుల పాలిట స్వర్గంగా మారింది. పోలీసు ప్రకటనలు తేలిపోయి, మరోసారి పందెగాళ్లదే పైచేయి అయింది. సంప్రదాయం పేరుతో నిర్వహించే కోడిపందాలు ఈసారి మరింత జోరుగా సాగాయి.

గంటల వ్యవధిలో పందాలకు ఏర్పాట్లు చేసేసి, వేల సంఖ్యలో పందెగాళ్లను రప్పించేసి అదే సమయంలో పేకాట, గుండాట, కోతాట ఇలా రకరకాల జూదాలకు వేదికలు ఏర్పాటుచేయడంతో ఒక్కసారిగా గురువారం ఉదయానికి జిల్లా మొత్తం జూద గోదావరిగా మారిపోయింది. అడ్డూ అదుపు లేకుండా ఆడటం అంటే ఎక్కడో దూరంగా పొలాల మధ్యలో బరులు ఏర్పాటుచేసుకోవటం కాకుండా రహదారి పక్కనే, ప్రధాన సెంటర్లకు దగ్గరలోనే ఇటువంటి బరులు ఏర్పాటుచేసుకోవటం, వాటికి మించి పేకాట శిబిరాలను జోరుగా నిర్వహించడం జరిగిపోయాయి. సుఖంగా, సౌకర్యవంతంగా ఈ పందాల జాతర సాగిపోయింది.

Crores of rupees spent in cock fight

మెట్ట, డెల్టా అన్న తేడా లేకుండా పల్లెపల్లెన ఈసారి పందాల బరులు ఏర్పడటం విశేషం. అదే జోరు శుక్రవారం రాత్రి వరకు సాగిపోయింది. ఈమధ్యలో ఎక్కడా పోలీసు ప్రస్తావనగాని, ఖాకీల జాడ గాని లేకపోవటం ఈసారి విచిత్రంగానే కన్పించింది. కత్తులు కట్టేదిలేదని, సంప్రదాయ పందాలంటూ నాయకుల నోట మాటలు విన్పించినా ఆ పరిస్దితి ఒక్క బరిలో కూడా లేదంటే ఆతిశయోక్తి కాదు. వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని చెపుతున్నారు. పందాలకు మించి ఆ వేదికను ఆధారం చేసుకుని వెలిసిన పేకాట శిబిరాలు మాత్రం పూర్తి స్థాయిలో కళకళలాడిపోయాయి.

కొన్ని బరుల వద్ద కోడిపందాల దగ్గర కన్నా పేకాట శిబిరాల వద్ద అధిక సంఖ్యలో జూదగాళ్లు చేరారంటే అతిశయోక్తి కాదు. వీటితోపాటు గుండాట తదితర జూదాలు కూడా జనాన్ని పూర్తిస్థాయిలో అలరించాయి. కృష్ణాజిల్లాలో కూడా అధికారపక్ష ప్రజాప్రతినిధుల మద్దతుతో గ్రామగ్రామాన షామియానాలు వేసి రాత్రి పగలు తేడా లేకుండా కోడిపందాలు నిర్వహించారు. కనీసం కానిస్టేబుల్ కూడా అటువైపు కన్నేత్తి చూసే ధైర్యం చేయలేకపోవటంతో మరింతగా ఈ శిబిరాలు వెలిసాయి.

సంక్రాంతి రోజున ఏలూరు ఎంపి మాగంటి బాబు కైకలూరులోని తమ పంట భూముల్లో ఏర్పాటుచేసిన పందాలకు జిల్లా అంతటి నుండి ఔత్సాహికులు తరలివెళ్లారు. ఓవైపు కోడిపందాలు మరోవైపు పసందైన విందు భోజనాలు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే స్వయంగా కత్తికట్టిన కోళ్లను బరిలోకి దించి అభిమానులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

English summary
Crores of Rupees were spent in cock fights in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X