• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాశ్మీర్‌లో చిక్కుకున్న తెలుగోళ్లు: హీరోలా.. ఎవరీ 'టెర్రరిస్ట్' బుర్హాన్?

|

శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని కాల్చివేత నేపథ్యంలో కాశ్మీర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రీకులు చిక్కుకుపోయారు. ఉద్రిక్తత నేపథ్యంలో కాశ్మీర్లో కర్ఫ్యూ విధించారు.

బుర్హాన్ కాల్చివేత: అట్టుడికిన కాశ్మీర్, బీజేపీ ఆఫీస్‌పై దాడి

దీంతో ఏపీకి చెందిన 247 మంది యాత్రికులు కాశ్మీర్‌లో చిక్కుకుపోయారు. అల్లర్లు, కర్ఫ్యూ కారణంగా ఎక్కడికీ వెళ్లలేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 150, చిలకలూరిపేటకు చెందిన 50, నెల్లూరు జిల్లాకు చెందిన 47 మంది యాత్రికులు బల్తాల్‌ వద్ద చిక్కుకుపోయారు.

Burhan Muzzafar Wani

స్వస్థలాలకు వచ్చే అవకాశం లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి చెందిన యాత్రికులు కశ్మీర్‌లో చిక్కుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. యాత్రికులు స్వస్థలాలకు చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

క్షేమంగా తెలుగు యాత్రికులు

కాశ్మీర్లో చిక్కుకున్న తెలుగు యాత్రీకులు క్షేమంగానే ఉన్నారని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. కాశ్మీర్ పోలీసులకు వారి సమాచారం అందించామని, వారు యాత్రికులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. బల్తాన్, పహల్గాన్, శ్రీనగర్ ప్రాంతాలలో తెలుగు యాత్రీకులు చిక్కుకున్నట్లు తెలిపారు.

ఎవరీ బుర్హాని వాని?

శుక్రవారం రాత్రి అనంతనాగ్‌లోని కొకేర్‌నాగ్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కీలక ఉగ్రవాది బుర్హాన్ వానితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. దీంతో కాశ్మీర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

టెర్రరిజం నయా పోకడలకు ప్రతిరూపం బుర్హాన్‌ వాని. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాదులు ఎన్నో ఏళ్లుగా అధునాతన తుపాకులు, పేలుడు పదార్ధాలను ఆయుధాలుగా ఉపయోగిస్తే అతను మాత్రం సామాజిక మాధ్యమాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు.

కరడు గట్టిన తీవ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఈ యువ కమాండర్‌ ట్విట్టర్, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కాశ్మీరీ యువతను ఆకట్టుకున్నాడు. అతనికి పట్టుమని పాతికేళ్లయినా లేవు. తీవ్రవాద భావాలను, వేర్పాటువాద బీజాలను నాటటంలో రాటు తేలాడు.

సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడుతూ, ఉత్తేజపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తూ, ప్రసంగ వీడియోలు పంపుతూ ఎంతో మంది యువతను ప్రభావితమయ్యేటట్లు చేశాడు. దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన యువకులు ఎందరో అతని అనుచరులు అయ్యారు.

వారితో కలిసి ఆయుధ శిక్షణ తీసుకుంటున్న ఫొటోలు, క్రికెట్‌ ఆడుతున్న ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేవాడు. కశ్మీర్‌ లోయలో మొదటి నుంచీ లష్కరే తొయిబా బలమైన తీవ్రవాద సంస్థ. కానీ బుర్హాన్‌ వాని వల్ల హిజ్బుల్ ముజాహిదీన్‌ బలం పుంజుకుంది. అతనికున్న అభిమానుల సంఖ్య చూసి హిజ్బుల్ ముజాహిదీన్‌ అయిదేళ్ల క్రితం బుర్హాన్‌ను తమ కమాండర్‌గా ప్రకటించింది.

ఇతనిది దక్షిణ కశ్మీర్‌లోని ట్రాల్‌ పట్టణం. తండ్రి ప్రధానోపాధ్యాయుడు. తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్‌. బుర్హాన్‌కు క్రికెట్‌ అంటే అభిమానం. మంచి క్రికెటర్‌ అవుతాడనుకుంటే... కానీ తీవ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. త్వరగానే హిజ్బుల్ ముజాహిదీన్‌ కమాండర్‌గా ఎదిగాడు.

ఏకే 47 తుపాకులు ధరించి కొందరు సహచర తీవ్రవాదులతో కలిసి దిగిన ఫొటోలను 2014లో సామాజిక మాధ్యమాల్లో బుర్హాన్‌ పోస్ట్‌ చేశాడు. ఇవి కాశ్మీరీ యువతను ఎంతగానో ఆకర్షించినట్లు చెబుతారు. గత నెలలో బుర్హాన్‌ విడుదల చేసిన ఒక వీడియో ఎంతో సంచలనం రేపింది.

బహిరంగ రిక్రూట్మెంట్

సైనికుల కాలనీలు, కాశ్మీరీ పండిట్లు, పోలీసులపై పెద్దఎత్తున దాడులు చేస్తామని ఈ వీడియోలో అతను హెచ్చరించాడు. మిలిటెంట్ల రిక్రూట్‌మెంట్లను బహిరంగంగా నిర్వహించిన ప్రత్యేకత బుర్హాన్‌ సొంతం. ఫొటోలు, ప్రసంగాలు, వీడియో సందేశాల ద్వారా యువతను ఆకట్టుకోవటమే కాకుండా, ప్రకటనలు ఇచ్చి నియమాకలు చేసేవాడు.

ముఖం కప్పుకోడు

ఇతర తీవ్రవాదుల మాదిరిగా తన ముఖాన్ని ముసుగుతో కప్పుకొనేవాడు కాదు. హీరో మాదిరిగా ఫొటోలు దిగి వాటిని ప్రచారంలో పెట్టేవాడు. తీవ్రవాదులుగా చేరటానికి వచ్చిన వారికి మంచి బహుమతులు, ఆయుధాలు ఇస్తానని ఎర వేసేవాడు. ఇలా విభిన్నమైన పోకడలతో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాడు.

బుర్హాన్ సోదరుడు ఖలీద్ ఏడాదిన్నర క్రితం హతమయ్యాడు. దీంతో ఇతను వెలుగులోకి వచ్చాడు. ఇతని కదలికలపై పోలీసు బలగాలు నిఘా పెట్టాయి. తాజాగా త్రాల్‌ అటవీ ప్రాంతం నుంచి ఈద్‌ వేడుకలకు బుర్హాన్‌ వస్తున్నాడనే స్పష్టమైన సమాచారంతో భద్రతా బలగాలు మాటువేసి హతమార్చాయి.

English summary
Curfew In Srinagar, Telugu people standard in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X