మెగాస్టార్-నాగ్ చేయలేనిది ఆర్జీవీ చేస్తారా : మంత్రి నానితో భేటీ : టాలీవుడ్ లో ఉత్కంఠ..!!
టాలీవుడ్ వర్సస్ ఏపీ ప్రభుత్వం కోల్డ్ వార్ నేడు మరో మలుపు తీసుకోనుంది. సినిమా టిక్కెట్ల వ్యవహారం లో ఈ రోజున కొత్త సన్నివేశం చోటు చేసుకోబోతోంది. ఇప్పటి వరకు సినిమా సమస్యల పైన మెగాస్టార్ చిరంజీవి..ఆ తరువాత ఆయన నాయకత్వంలో నిర్మాత-దర్శకుల టీం సీఎం జగన్ తో సమావేశం అయింది. అయితే, సినిమా టిక్కెట్ల ధరల పెంపు అంశం పైన ప్రభుత్వానికి ట్వీట్లు...వినతుల మినహా టాలీవుడ్ నుంచి ఏ ప్రముఖ హీరో నేరుగా చర్చలకు రాలేదు. కానీ, సడన్ గా దర్శకుడు ఆర్జీవీ ఈ ఎపిసోడ్ లో ఎంటర్ అయ్యారు. ఎంట్రీ ఇస్తూనే చర్చకు తెర లేపారు.

ఆర్జీవీ ఎంట్రీతో కొత్త సీన్
సినిమా టికెట్ ధరను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. పది ప్రశ్నలతో సోషల్ మీడియాలో పోస్టు చేసారు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు నుంచి మద్దతు లభించింది. వీటికి మంత్రి పేర్ని నాని స్పందించారు. వాటికి ప్రతిస్పందనగా ఆర్జీవీ మరింత లాజిక్ తో ఈ ఎపిసోడ్ లో మంత్రి నుంచి సమాధానం కోరారు.
ఇక, ఆర్జీవీ తాను మంత్రితో డైరెక్ట్ గా సమావేశం కావాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేసారు. మంత్రి వెంటనే ఓకే చెప్పేసారు. అంతే, ఇక ఈ రోజు మధ్నాహ్నం ఏపీ సచివాలయంలో మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ సమావేశం కానున్నారు. 11.45గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్జీవీ చేరుకుంటారు. అక్కడ నుంచి సచివాలయం వెళ్లి.. మంత్రితో సమావేశం అవుతారు.

ట్వీట్ వార్ తోనే హీట్ మొదలు
ఏపీ ప్రభుత్వం జీవో నెం 35ను ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు నిర్ణయించి ఆ ధరలకంటే ఎక్కువకు అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో మరోసారి హైకోర్టు ఏపీ సినిమా టికెట్లపై విచారణ చేపట్టింది.
ఇదే సమయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ రెండో సమావేశం రేపు జరగనుంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ సమస్యలపైన వచ్చిన వారితో మంత్రి పేర్ని నాని చర్చలు చేస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఆర్జీవీ తన లాజిక్కులు..సైంటిఫిక్ థియరీలు..రాజ్యాంగం హక్కుల గురించి ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా మంత్రి పేర్ని నాని సమాధానాలు కోరారు.

పేర్ని నాని..ఆర్జీవి ఇద్దరూ ఇద్దరే
మంత్రి నాని చెప్పిన సమాధానాలతో ఆర్జీవి ఆగిపోలేదు. మంత్రితో నేరుగా చర్చించేందుకు ముందుకు వచ్చారు. అయితే, ఇప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు ఏపీలోనూ పెంచాలని టాలీవుడ్ మొత్తం కోరుకుంటోంది. కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. టిక్కెట్ల ధరలు పెంచితే కొందరు నిర్మాతలకు మినహా ఎవరికీ ప్రయోజనం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఆర్జీవీ - మంత్రి నాని ట్వీట్ల సమయంలో రెమ్యునరేషన్ల అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. టిక్కెట్ల ధరల అంశం.. సినిమా నిర్మాణ ఖర్చులు అంశాల పైన చర్చ జరిగింది.

పరిష్కారం వస్తుందా.. కొత్త టర్న్ తీసుకుంటుందా
ఇక, టిక్కెట్ల ధరల పైన ఏపీ ప్రభుత్వంలో చర్చించే అంశం లో చిరంజీవి - నాగార్జున వంటి ప్రముఖ హీరోలు.. ప్రముఖ దర్శక - నిర్మాతలు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆర్జీవీ సిద్దమయ్యారు. అయితే, ఆర్జీవీ - మంత్రి పేర్ని నాని మధ్య ఈ అంశం పైన జరిగే చర్చ లో ఏం తేలనుందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.
ఆర్జీవీ తన ప్రశ్నలతో మంత్రిని కన్ ఫ్యూజ్ చేస్తారా.. మంత్రి పేర్ని నాని తన సమాధానంతో ఆర్జీవీ ఒప్పిస్తారా.. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా గుర్తింపు ఉండటంతో..అసలు ఈ వ్యవహారానికి ముగింపు లభిస్తుందా.. కొత్త టర్న్ తీసుకుంటుందా అనే చర్చ ఇప్పుడు అటు పొలిటికల్..ఇటు టాలీవుడ్ సర్కిల్స్ లో మొదలైంది.