బాపట్ల-బందరు మధ్య తీరాన్ని తాకిన అసని తుపాన్-వాయుగుండంగా మార్పు-భారీవర్షాలు
ఏపీలో అసని తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో నిన్నటి నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అసని తుఫాన్ నిన్నటి నుంచి దిశలు మార్చుకుంటూ ఇవాళ సాయంత్రానికి బాపట్ల నుంచి మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది. మరో రెండు గంటల్లో తీరం దాటబోతోంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడబోతోంది.
అసని తుఫాన్ నిన్నటి తో పోలిస్తే ఇవాళ కాస్త నెమ్మదించింది. గంటకు కేవలం 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కాకినాడ నుంచి బాపట్ల వరకూ వచ్చింది. అక్కడి నుంచి తిరిగి బందరు వైపుకు మళ్లింది. ఆ మధ్యలోనే తీరాన్ని తాకింది. మరికొన్ని గంటల్లో పూర్తిగా తీరం దాటిన తర్వాత తిరిగి సముద్రంలోకి మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తుఫాన్ గమనాన్ని కానీ, వాతావరణ శాఖ అంచనాల్ని బట్టి చూసినా రేపటి కల్లా తుఫాన్ కాస్తా వాయుగుండంగా బలహీనపడి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయే అవకాశాలున్నాయి.

అసని తుఫాన్ కారణంగా ఇప్పటికేకాకినాడ, యానాం, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో అలలు కూడా భారీగా ఎగసిపడుతున్నాయి. పలు చోట్ల సముద్రం కూడా ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే స్పందించడానికి స్ధానికంగా అధికారులు, పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం కోస్తా తీర ప్రాంతాల్లో ప్రతీ చోటా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది.