జవాద్ ఎఫెక్ట్ - వణుకుతున్న ఉత్తరాంధ్ర -రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్- అధికారుల కీలక సూచనలు
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలపై జవాద్ తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో ఇది తీరం దాటుతుందని భావిస్తున్నారు దీంతో జవాద్ తుపాను ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
జవాద్ తుఫానుపై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయిందని పోలీస్ అధికారులు సిబ్బందికి ఇప్పటికే అప్రమత్తం చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమై జవాద్ తుఫాన్ తీరం దాటే సమయంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ సూచించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ పలు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జల్లాలో ఇప్పటికీ సుమారు 239 తుఫాన్ ప్రభావిత తీరప్రాంత గ్రామంలో గుర్తించామని, ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులును. నియమించడం జరిగిందన్నారు.

తీరా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాకు 3 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలతో పాటు, రాష్ట్ర విపత్తు ప్రతి దళాలు చేరుకున్నాయిన్నారు.తుఫాన్ ప్రభావం ద్వారా నేలకురిగిన వృక్షాలు,చెట్లను సకాలంలో తొలిగించి రహదారి మార్గంలో రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని జాతీయ,రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ సిబ్బందికి సన్నద్ధం చేశామని అన్నారు. తుఫాను సమయంలో జిల్లా రెవిన్యూ పోలీసు ఇతర విభాగాల యంత్రాంగలు సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా అన్ని విధాలా సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తుఫాను హెచ్చరిక దృష్ట్యా శనివారం భారీ వర్ష సూచన ఉందని, 65 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉందని శ్రీకాకుళం ఎస్పీ తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో బయట ప్రదేశాల్లో ప్రజలు ఎవరు ఉండకూడదని ప్రజలకు సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉండరాదని, తుఫాన్ రక్షిత భవనాలు,పునరావాస కేంద్రాలలోను మాత్రమే ఉండాలని కోరారు. అదేవిదంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కోరారు.పశు సంపదనకు ఎటువంటి హానీ జరగకుండా సురక్ష ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్దం చేసిమన్నారు.భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నందున మడ్డువలస డ్యామ్ లో నీటిమట్టాన్ని కొంతమేరకు తగ్గించడం జరిగిందని తెలిపారు.