ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు .. ఫిర్యాదుల వెల్లువ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆగ్రహ జ్వాలలు మిన్నుముడుతున్నాయి . ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాలుగు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు కాగా పలు చోట్ల నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి.
చంద్రబాబు నాయుడు పిట్టల దొర.. పగటి వేషగాడు: మంత్రి కొడాలి నానీ

చంద్రబాబుపై ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చెయ్యాలని డిమాండ్
ఏపీ మాజీ సీఎం ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దళితుడు కావటంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, దళితులను అవమానించారని ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీ లెజిస్లేటివ్ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదైన విషయం తెలిసిందే . ఇక అంతేకాదు చంద్రబాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పరిరక్షణ సంఘం నేతలు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదుల వెల్లువ
దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజయవాడ నగర పోలీసు కమిషనర్ తిరుమలరావుకు సోమవారం దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళితుల పట్ల టీడీపీ తీరు మార్చుకోకపోతే రాజకీయసమాధి కడతామని వారు చంద్రబాబును హెచ్చరించారు.

పలు జిల్లాలలో కేసులు నమోదు
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ సూర్యచంద్రరావుకు వినతిపత్రం ఇచ్చారు. దళితులను అవమానించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరమ్ సభ్యులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రజా, దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు
ఇక అంతే కాదు పలు చోట్ల చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా దళిత బహుజన సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మున్సిపల్ కమిషనర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. విజయ్ కుమార్‌ని కించపరిచేలా మాట్లాడడాన్ని వ్యతిరేకించిన అధికారులు చంద్రబాబు తక్షణమే తన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.