రేపిస్టుల్ని భయపెట్టని రమ్య కేసు తీర్పు-ఉరిశిక్ష తర్వాతా ఆగని అత్యాచారాలు- లోపమెక్కడుంది ?
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు అరికట్టేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ చట్టానికి కేంద్రం ఆమోదం లభించకపోయినా రాష్ట్రంలో ప్రత్యేక పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు, పోలీసులు అందుబాటులోకి వచ్చేశారు. దీంతో గుంటూరు రమ్య హత్య కేసులో నిందితుడికి 257 రోజుల్లోనే ఉరిశిక్ష వేయించామని ప్రభుత్వం సంబరపడింది. అయితే ఆ తర్వాత కూడా అత్యాచార ఘటనలు, యత్నాలు ఆగడం లేదు.
గుంటూరు రమ్య హత్య కేసులో నిందితుడికి 9 నెలల్లోనే ఉరిశిక్ష వేయించగలగడం వెనుక దిశ చట్టం ఉందని ప్రభుత్వం జబ్బలు చరుచుకుంది. దిశ చట్టానికి కేంద్రం ఆమోదం లభించకపోయినా రాష్ట్రంలో తాము మాత్రం పక్కాగా దీన్ని అమలు చేయడం వల్లే నిందితుడికి ఉరిశిక్ష పడిందని ప్రభుత్వం, మంత్రులు తెర ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ తీర్పు వెలువడిన 48 గంటల్లోనే అదే గుంటూరు జిల్లా రేపల్లెలో మరో సామూహిక అత్యాచారం జరిగిపోయింది. దీంతో ప్రభుత్వానికి రమ్య కేసు తీర్పుతో వచ్చిన మైలేజ్ కాస్తా ఆవిరైంది.

గుంటూరు రమ్య హత్యకేసులో తీర్పు రాకముందే దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇస్తున్న తీర్పుపై మీడియాతో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేశాయి. బహుశా ఈ తీర్పును వీరంతా ముందుగానే ఊహించి ఉండొచ్చు. కానీ ఈ తీర్పుకు ముందే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరగింది. ఈ తీర్పు తర్వాత ఇక అలాంటి ఘటనలు జరగవని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికి, సాధారణ ప్రజలకు కూడా రేపల్లె గ్యాంగ్ రేప్ ఘటన షాకిచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం మరోసారి దిశ పేరు ధైర్యంగా చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది.
గతేడాది రాష్ట్రంలో ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం నిరాటంకంగా కొనసాగింది. ప్రతీ రోజూ ఎక్కడో ఓ చోట విగ్రహాల ధ్వంసం జరిగేది. దీంతో ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యేది. అంతర్వేదిలో రధం దగ్ధం, విజయవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాల చోరీ వంటి ఘటనలతో ప్రభుత్వం పూర్తిగా ఇరుకునపడింది. ఈ దశలో ప్రభుత్వం పోలీసుల సాయంతో సీరియస్ గా దర్యాప్తు చేసి ఈ మాస్ హిస్టీరియా వెనుక ఏం ఉందనే అంశాల్ని తెలుసుకుంది. కఠిన చర్యలకు దిగింది. దీంతో ఈ ఘటనల వెనుక ఉన్న కారణాలతో పాటు ఎవరెవరు ఏం చేయించారనే విషయాలు కూడా బయటికి వచ్చేశాయి.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రేప్ లను, అత్యాచార యత్నాల్ని చూస్తుంటే ఇక్కడ కూడా మాస్ హిస్టీరియా అంశం తెరపైకి వస్తోంది. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఇలాంటి ఘటనల్లో నిందితులంతా మందుబాబులే కావడం, క్షణాకావేశంలో చేస్తున్న తప్పులే కావడంతో ప్రభుత్వం వీటికి అడ్డుకట్టే వేసే విషయంలో ఆలయాల ఘటనల సమయంలో అనుసరించిన వ్యూహాన్నే మరోమారు ప్రయోగించాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే నిందితుల్లో భయం పెరగడంతో పాటు శిక్షలపైనా అవగాహన పెరుగుతుంది. అంతిమంగా మహిళాలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. అప్పటివరకూ కోర్టు తీర్పులు ఎంత తీవ్రంగా ఉన్నా ఇలాంటి మృగాళ్లపై ప్రభావం చూపేలా లేవు.